పశ్చిమాసియాలో యుద్దం స్టాక్ మార్కెట్లను నష్టాల్లోకి నెట్టింది. ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ సూచీలు ఓ దశలో కొంత వరకు కోలుకున్నా, తరవాత భారీగా పతనమయ్యాయి. ఉదయం 1257 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ తరవాత 560 పాయింట్లు కోలుకుంది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1769 పాయింట్లు నష్టపోయి, 82497 వద్ద ముగిసింది. నిఫ్టీ 547 పాయింట్లు నష్టపోయి 25250 వద్ద ముగిసింది. మార్కెట్లో ఏ దశలోనూ కొనుగోళ్లకు మద్దతు లభించలేదు. అంతర్జాతీయ మార్కెట్లు సైతం తీవ్ర నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
సెన్సెక్స్ 30 ఇండెక్సులో జెఎస్డబ్ల్యూ స్టీల్ మినహా అన్ని కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎం అండ్ ఎం, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ నష్టాల్లో ముగిశాయి. ఇవాళ ఒక్క రోజే పెట్టుబడి దారులు రూ.11 లక్షల కోట్లు నష్టపోయారు.
డాలరుతో రూపాయి మారకం విలువ రూ.83.97 వద్ద ట్రేడవుతోంది. ముడి చమురు ధరలు మరోసారి భగ్గుమన్నాయి. బ్యారెల్ ముడిచమురు ధర 75.27 యూఎస్ డాలర్లకు చేరింది. బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. ఔన్సు స్వచ్ఛమైన బంగారం 2665 అమెరికా డాలర్లకు చేరింది.