తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగానికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. సోలిసిటర్ జనరల్ అభ్యర్థనతో విచారణను చివరి నిమిషంలో శుక్రవారానికి వాయిదా వేసింది.
గత విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు కొనసాగించాలా? లేదా స్వతంత్ర దర్యాప్తు జరిపించాలా? అనే అంశంపై కేంద్రం అభిప్రాయం చెప్పాలని సుప్రీంకోర్టు కోరింది. సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు ఈ రోజు వరకు సమయం ఇచ్చింది. ఇవాళ 3గం.30ని. విచారణ జరగాల్సి ఉండగా.. రేపటి వరకు సమయం కావాలని సోలిసిటర్ జనరల్ కోరారు. దీంతో రేపు సుదీర్ఘంగా విచారిస్తామని, ఇరువైపుల వాదనలు వింటామని ధర్మాసనం తెలిపింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం ఈ పిటిషన్లను విచారిస్తోంది.
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యిని వాడారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వాస్తవాలను నిగ్గు తేల్చాలని సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి పిల్ వేశారు. నెయ్యి కల్తీ వ్యవహారంలో దర్యాప్తు, స్వతంత్ర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నియమించాలని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి కూడా మరో పిల్ దాఖలు చేశారు. ఇదే అంశంపై సంపత్, శ్రీధర్, సురేష్ చవంకేలు వేర్వేరుగా మరో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నాలుగు పిటిషన్లను జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తోంది.