తెలుగు రాష్ట్రాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నేడు తొలిరోజు ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మవారు శ్రీబాలత్రిపురసుందరిదేవిగా, శ్రీశైలంలో భ్రమరాంబదేవి, వరంగల్ భద్రకాళి దేవి, వనదుర్గ భవానీ మాతలు శైలపుత్రి అలకరణలో దర్శనమిస్తూ భక్తులను కటాక్షిస్తున్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి కొండ దిగువన వినాయక గుడి నుంచి క్యూలైన్లు ఏర్పాటు చేశారు. రెండు కిలోమీటర్ల దూరం నడిచి వచ్చి ఘాట్‌రోడ్డు మీదుగా వెళ్లి అమ్మవారిని దర్శించుకోవాలి. శివాలయం మెట్ల మార్గానికి పక్కనే ఏర్పాటు చేసిన తాత్కాలిక మార్గం, మహామండపంలో ర్యాంప్, మెట్ల మార్గం ద్వారా భక్తులు కిందకు దిగేలా ఏర్పాట్లు చేశారు.
ప్రతీరోజు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ అమ్మవారి దర్శనానికి భక్తులకు అవకాశం కల్పించారు. ఐదు క్యూలైన్లలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవచ్చు. రూ.100, రూ.300, రూ.500 క్యూలైన్లతో పాటు రెండు ఉచిత దర్శన క్యూలైన్లు ఉన్నాయి. భక్తుల కోసం లడ్డూ ప్రసాదం తయారు చేశారు. ఉచిత ప్రసాదంగా పులిహోర, కట్టె పొంగలి, దద్దోజనం, సాంబారు అన్నం అందించనున్నారు.
బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలోని దుర్గమ్మ వారికి బంగారు అభయహస్తాలు, బంగారు పూలజడ, కంఠాభరణాలు, బంగారు వడ్డాణం అలంకరించారు.