మహారాష్ట్రకు చెందిన ఓ ఎమ్మెల్యే, మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రైతు కుటుంబంలో పుట్టిన అబ్బాయిలను పెళ్లి చేసుకునేందుకు అందమైన అమ్మాయిలు ఇష్టపడరని ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. అమ్మాయిలను వర్గాలుగా విభజిస్తూ వారి పెళ్ళి ఎంపికలపై విశ్లేషణ చేయడం తీవ్ర వివాదాస్పదం అయింది. ఎమ్మెల్యే దేవేంద్ర భుయార్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అమరావతి జిల్లా పరిధిలోని వరూడ్-మోర్షీ నియోజకవర్గానికి స్వతంత్ర ఎమ్మెల్యే దేవేంద్ర భుయార్, ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సన్నిహితుల్లో దేవేంద్ర ఒకరు. రైతు సమస్యలపై వరూడ్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో దేవేంద్ర భుయార్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అందమైన అమ్మాయిలు, మంచి ఉద్యోగం ఉన్నవారినే పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడతారని అన్నారు. ఓ మోస్తరు అందంగా ఉండే (రెండో కేటగిరి) అమ్మాయిలు, కిరాణా, పాన్ షాప్ నడిపేవారిని ఎంచుకుంటారని అన్నారు. మూడో రకానికి చెందిన వారే రైతు బిడ్డను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతారన్నారు. అలాంటి దంపతులకు జన్మించే పిల్లలు కూడా అందవిహీనంగా ఉంటారని వ్యాఖ్యానించడం తీవ్ర సంచలనం రేపింది. మహిళలను అలా వర్గీకరిస్తూ వ్యాఖ్యానించడం సరికాదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.