ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ్టి నుంచీ చెత్త పన్ను రద్దయింది. ఆ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్రంలో ఎక్కడా చెత్త పన్ను వసూలు చేయడానికి వీలు లేదని ఆదేశించారు. గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో నిర్వహించిన స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఈ ఆదేశాలు జారీ చేసారు.
గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.2014లో అక్టోబర్ 2న స్వచ్ఛభారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రధాని నరేంద్రమోదీని అభినందించారు. నీతి ఆయోగ్‌లో స్వచ్ఛభారత్ ఉపసంఘానికి తాను ఛైర్మన్‌గా వ్యవహరించిన సంగతిని గుర్తు చేసారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా రాష్ట్రంలో రెండు లక్షలకు పైగా టాయిలెట్లు నిర్మించామని చెప్పారు.
వైఎస్ఆర్‌సిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో రహదారుల మీద 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని సీఎం చెప్పారు. ఆ మొత్తం చెత్తని సంవత్సరం లోగా శుభ్రం చేయించాలని ఆదేశించామన్నారు. 2029 నాటికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యానికి చేరుకోవాలని పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి మచిలీపట్నం గురించి మాట్లాడుతూ, అక్కడ కొందరు స్వార్థ పరులు ఆంధ్ర జాతీయ కళాశాలను కబ్జా చేశారని మండిపడ్డారు. ఆ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని హామీ ఇచ్చారు. జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య పేరు మీద వైద్యకళాశాల ఏర్పాటు చేస్తామన్నారు.