సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం అనంతరం దీక్ష విరమించారు. 11 రోజులపాటు సాగిన ఆయన దీక్ష నేటితో ముగిసింది. తిరుపతి లడ్డూ తయారీలో కల్తీనేయి వినియోగం మీద అనుమానాలు తలెత్తిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.
మంగళవారం రాత్రి అలిపిరి మెట్లమార్గం ద్వారా తిరుమల చేరుకున్న పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుమార్తెలు ఆద్య, పొలెనా అంజనలతో కలసి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి వారాహి డిక్లరేషన్‌ను స్వామి పాదాల చెంత ఉంచారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు పవన్ కళ్యాణ్‌కు ఆశీర్వచనం చేసారు.
దర్శనం అనంతరం పవన్ కళ్యాణ్ నేరుగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ అన్నదాన సరళిని పరిశీలించారు. మిగతా భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు.
దర్శనానికి ముందు చిన్న కుమార్తె పొలెనా అంజనతో డిక్లరేషన్ ఇప్పించారు. కుమార్తె మైనర్ కావడంతో తండ్రిగా ఆయన కూడా డిక్లరేషన్ ఫాంపై సంతకం చేశారు. పవన్ కళ్యాణ్‌తో పాటు శాసన మండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్, శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు, అరవ శ్రీధర్, దర్శకుడు త్రివిక్రమ్, కళాదర్శకుడు ఆనందసాయి తదితరులు స్వామిని దర్శించుకున్నారు.