జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు రాజ్ ఘాట్ కు వెళ్ళి నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయనకు నివాళులర్పించారు. సత్యం, సామరస్యం, సమానత్వం అనే సిద్ధాంతాలతోనే బాపూజీ జీవితం గడిచిందని మోదీ ట్వీట్ చేశారు. మహాత్ముడి ఆదర్శాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయన్నారు.
ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, దిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ కూడా మహాత్ముడి సేవలను స్మరించారు.
విద్యార్థులతో కలిసి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ, పరిసరాల పరిశుభ్రతకు ప్రజలంతా ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ప్రధాని మోదీ పిలుపుమేరకు పలువురు రాజకీయ నాయకులు స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కేంద్రమంత్రులు జేపీ నడ్డా, కిషన్రెడ్డి, రాజివ్రంజన్, ముఖేశ్ మాండవీయతో పాటు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ స్వచ్ఛత కార్యక్రమాల్లో పాల్గొన్నారు.