ప్రాయశ్చిత్త దీక్ష విరమణ కోసం తిరుమల వచ్చిన పవన్ కళ్యాణ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళారు. ఆ సందర్భంగా పవన్ చిన్నకుమార్తె డిక్లరేషన్ సమర్పించింది.
సినీనటుడు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రష్యాకు చెందిన అన్నా లెజినేవాను వివాహం ఆడిన సంగతి తెలిసిందే. అన్నా క్రైస్తవ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఆమె ద్వారా పుట్టిన కుమార్తె పొలెనా అంజన కూడా క్రైస్తవ మతాన్ని పాటిస్తున్నారు. తిరుపతి సంప్రదాయం ప్రకారం, క్రైస్తవురాలైన పొలెనా స్వామి దర్శనానికి వెళ్ళడానికి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. స్వామి పట్ల విశ్వాసం, భక్తి శ్రద్ధలు ఉన్నందున దర్శనానికి వచ్చినట్లు ఆ డిక్లరేషన్‌లో వెల్లడించాలి. పొలెనా ఇంకా మైనర్ కావడంతో ఆమె తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా ఆ డిక్లరేషన్ మీద సంతకం చేసారు. ఆ సమయంలో పవన్ పెద్దకుమార్తె ఆద్య కూడా ఉన్నారు. ఇద్దరు కూతుళ్ళతో పవన్ కళ్యాణ్ కనిపించడం ఇదే మొదటిసారి.
తిరుమల లడ్డూలో వాడే నేతిలో కల్తీ జరిగిందన్న ఆరోపణలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. సెప్టెంబర్ 22 నుంచి 11 రోజుల పాటు కొనసాగించిన దీక్ష ముగించడం కోసం గత రాత్రి ఆయన తిరుమల చేరుకున్నారు. నిన్న మంగళవారం సాయంత్రం గోవింద నామస్మరణ చేస్తూ కాలినడకన 3550 మెట్లు ఎక్కి తిరుమల చేరుకున్నారు. ఈ ఉదయం స్వామి దర్శనంతో పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష ముగిసింది.
లడ్డూ వివాదంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లపై విరుచుకుపడిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో తమ పార్టీ నాయకులు పూజలు చేస్తారని చెప్పారు. ఆ సందర్భంగా తాను తిరుమల వెళ్తానని ప్రకటించారు. అయితే క్రైస్తవ మతస్తుడైన వైఎస్ జగన్, స్వామిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ సమర్పించడం తప్పనిసరి అని తితిదే అధికారులు కోరారు. డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేని జగన్, తిరుమల పర్యటననే రద్దు చేసుకున్నారు. ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కుమార్తె డిక్లరేషన్ సమర్పించడం ఆసక్తికరంగా నిలిచింది.