మొత్తం రూ. 15 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకారం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి రుణం అందించేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చింది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల చొరవతో రూ.15,000 కోట్ల రుణం ఇచ్చేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రపంచబ్యాంకు నుంచి కేంద్రానికి లేఖ అందింది. ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులు సంయుక్తంగా ఈ రుణం అందించేందుకు ముందుకొచ్చాయి. ఇంకో నెలన్నరలో ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మొత్తం రూ.15వేల కోట్లూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే సీఆర్‌డీఏకి అందనున్నాయి.
రాజధానిలో మౌలిక వసతులు, ఇతర నిర్మాణాల కోసం రూ.49వేల కోట్లు ఖర్చు అవుతుందని సీఆర్‌డీఏ తాజాగా అంచనా వేసింది. రూ.15 వేల కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే వస్తుండడంతో దానికి అనుగుణంగా సీఆర్‌డీఏ ముందుకు సాగనుంది.
దిల్లీలో కేంద్ర ఆర్థికశాఖ, ప్రపంచబ్యాంకు, సీఆర్‌డీఏ అధికారులతో ప్రపంచ బ్యాంకు అధికారులు భేటీ గురువారం జరగనుంది. నవంబరు 8న తుది సమావేశం జరగనుంది. అదే నెల 15 నాటికి సంతకాల ప్రక్రియ ముగుస్తుంది. ఆ తర్వాత మొత్తం రుణంలో 25 శాతం అంటే.. రూ.3,750 కోట్లు అడ్వాన్స్‌గా తీసుకోవచ్చు. నవంబరులో ఆ నిధులు వస్తే డిసెంబరు నుంచి రాజధాని పనులు మొదలుకానున్నాయి.