ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులతో దాడికి దిగింది. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేస్తుండటంతో కౌంటర్ గా ఇరాన్ దాడికి దిగింది.
ఇరాన్ 400పైగా క్షిపణులు తమ దేశంపై ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. టెల్ అవీవ్, జెరూసలేం సమీపంలో వరుస పేలుళ్లు జరిగినట్లుగా శబ్దాలు వినిపించాయని పేర్కొన్నారు. ఐరన్ డోమ్ వంటి సాంకేతిక వ్యవస్థలతో క్షిపణులను దీటుగా ఎదుర్కుంటున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. లక్షలాది మంది ఇజ్రాయెల్ వాసులు బంకర్లలోకి వెళ్ళారు.
హమాస్ అధినేత ఇస్మాయెల్ హనీయా, హెజ్బొల్లా చీఫ్ సయ్యద్ హసన్ నస్రల్లా, నిల్పోరూషన్ మరణానికి ప్రతీకారంగా ఈ దాడులు చేపట్టినట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఇజ్రాయెల్ ఆక్రమించిన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. మరోవైపు తమ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు ఇరాన్ సీనియర్ అధికారి తెలిపారు.