మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భూముల కేటాయింపు కుంభకోణంలో ఇవాళ మరో మలుపు చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య భార్య పార్వతి మైసూరులో తాము తీసుకున్న 14 వివాదాస్పద ప్లాట్లను వెనక్కు ఇచ్చేస్తామని ప్రకటించారు. మైసూరులోని విజయనగర్ 3, 4 ఫేజ్‌లలో తనకు కేటాయించిన ప్లాట్లను వదులుకుంటామని ఆమె ముడా కమిషనర్‌కు లేఖ రాసారు.
తేదీ లేకుండా పార్వతీ సిద్దరామయ్య రాసిన లేఖ విస్తృత చర్చనీయాంశమైంది. ఆ లేఖలో పార్వతి ‘‘ముడా నాకు మంజూరు చేసిన 14 ప్లాట్ల ఒప్పందాలను రద్దు చేసుకోవడం ద్వారా ఆ పరిహార ప్లాట్లను వెనక్కు ఇచ్చేయాలని భావిస్తున్నాను. ఆ ప్లాట్ల యాజమాన్యాన్ని ముడాకు అప్పగించేస్తున్నాను. ఆ మేరకు అవసరమైన చర్యలను వీలైనంత త్వరగా తీసుకోండి’’ అని రాసుకొచ్చారు.
ముడా కేసు తన భర్తను రాజకీయ సంక్షోభంలోకి నెట్టేస్తున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్వతి వివరించారు. ‘‘నా భర్త గౌరవం, హుందాతనం, సౌకర్యం కంటె ఏ భూమి లేదా ఆస్తి నాకు ముఖ్యం కాదు. నాకు ఏ ఆస్తులూ కావాలని ఎన్నడూ కోరుకోలేదు. ఈ వివాదం వల్ల నా భర్త రాజకీయ జీవితానికి బురద అంటకూడదు’’ అని పార్వతి తన లేఖలో రాసారు.
ఈ వివాదంలో వస్తున్న ఆరోపణలు తన మనసును తీవ్రంగా గాయపరిచాయని పార్వతి చెప్పుకొచ్చారు. తన భర్త ప్రతిష్ఠను కాపాడడం కోసమే ఆ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ముడా కేసులో అన్ని ఆరోపణలనూ విచారించడానికి నిశితంగా దర్యాప్తు చేయాలని ఆమె హైకోర్టును కోరారు.
తన భార్య నిర్ణయం తనను ఆశ్చర్యపరిచిందని సిద్దరామయ్య చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాలు తప్పుడు కేసులతో తన కుటుంబాన్ని వివాదంలోకి లాగాయని సీఎం ఆరోపించారు. ఈ అన్యాయానికి తల వంచకుండా పోరాడాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. రాజకీయ కుట్రలతో ఆందోళన చెందిన తన భార్య ఈ నిర్ణయం తీసుకుందన్నారు.
ప్రతిపక్ష బీజేపీ నేత ఆర్ అశోక ఈ వ్యవహారంపై స్పందించారు. ‘‘మొదట అసలు తమకు ఏ సంబంధమూ లేదన్నవారు ఇప్పుడు నిజానికి లొంగిపోయారు. దొంగతనం చేసిన వస్తువులను తిరిగి ఇచ్చేసినంత మాత్రాన వారి నేరం నేరం కాకపోతుందా?’’ అని అశోక ట్వీట్ చేసారు.