కేంద్రపాలిత ప్రాంతం డయ్యూలోని ఒక పాఠశాలలో దేశభక్తి నినాదాలు చేసినందుకు క్రైస్తవ ప్రిన్సిపాల్ విద్యార్ధులను చితకబాదిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ సంఘటనను స్థానిక హిందూసంఘాలు వెలుగులోకి తెచ్చాయి. సదరు ప్రిన్సిపాల్ మీద ఫిర్యాదు చేసాయి.
ఉపాధ్యాయుల దినం సెప్టెంబర్ 5న జాతీయ గీతం పాడిన తర్వాత కొందరు పిల్లలు ‘భారత్ మాతా కీ జయ్’, ‘జైహింద్’ వంటి దేశభక్తి నినాదాలు చేసారు. వాటిని వింటూనే ప్రిన్సిపాల్ ఎడ్మండ్ మాస్కరెన్హాస్ కోపంతో ఊగిపోయాడు. ముగ్గురు విద్యార్ధులను తీవ్రంగా దండించాడు. నిజానికి ఆ నినాదాలు చేసిన వారెవరో ఆయనకు తెలియదు. తన ఎదురుగా ఉన్న పిల్లల్లోనుంచి ముగ్గురిని ఎంచుకుని చితకబాదారు. ప్రిన్సిపాల్ మాస్కరెన్హాస్ బాధితులను కొడుతున్నప్పుడు తోటి విద్యార్ధులు భయంతో మౌనంగా ఉండిపోయారు. అక్కడున్న తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, ఆ సంఘటనలో జోక్యం చేసుకోలేదు.
ఆ విషయం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమైంది. దాంతో విషయం తెలిసిన విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ వంటి హిందూ సంస్థలు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించాయి. స్కూల్ ప్రిన్సిపాల్‌కు వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసాయి.
విహెచ్పి జిల్లా సమన్వయకర్త భరత్‌భాయి సోలంకీ స్పందిస్తూ ‘‘జాతీయ గీతం ముగియగానే ఒక పిల్లవాడు ‘భారత్ మాతా కీ జయ్’ అని అరిచాడు. దాంతో ప్రిన్సిపాల్ ముగ్గురు పిల్లలను సమీపంలోని షెడ్డులోకి తీసుకువెళ్ళి, వారిని పశువులను కొట్టినట్టు కొట్టాడు. పిల్లలు తాము ఏమీ చేయలేదని చెబుతూనే ఉన్నారు. ఐనా వారిని నిరంతరాయం కొడుతూనే ఉన్నారు.
స్థానికులు చెప్పిన వివరాలను బట్టి, ప్రిన్సిపాల్ ఎడ్మండ్ మార్కరెన్హాస్ అంటే వారికి పరమ భయమని స్పష్టమైంది. స్థానికుల్లో చాలామంది నిరక్షరాస్యులు, నిరుపేదలు. మార్కరెన్హాస్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తే తమ పిల్లలను స్కూల్ నుంచి తొలగిస్తారని భయపడేవారే ఎక్కువ. మాస్కరెన్హాస్ దుష్ప్రవర్తనకు వ్యతిరేకంగా మాట్లాడడానికి పాఠశాల ఉద్యోగులకు సైతం ధైర్యం సరిపోలేదని విహెచ్పి నాయకుడు భరత్ సోలంకీ చెప్పారు. ఎట్టకేలకు హిందూ సంస్థల ఫిర్యాదు మేరకు డయ్యూ పోలీసులు ప్రిన్సిపాల్ ఎడ్మండ్ మాస్కరెన్హాస్ మీద కేసు నమోదు చేసారు.