భారత సైనిక బలగాల వైద్యసేవల విభాగానికి డీజీగా (డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్) సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్తీ సరీన్ నియమితులయ్యారు. ఆ పదవి పొందిన మహిళా అధికారి ఆర్తీయే.
దేశపు 46వ డీజీఏఎఫ్ఎంఎస్గా నియమించబడడానికి ముందు ఆర్తీ సరీన్ నేవీలోను, ఎయిర్‌ఫోర్స్‌లోనూ డీజీఎంఎస్గా పనిచేసారు. పుణేలోని ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్‌కి డైరెక్టర్ అండ్ కమాండెంట్‌గా చేసారు.
ఆర్తీ సరీన్ పుణేలోని ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్‌లో రేడియో డయాగ్నసిస్‌లో ఎండీ చేసారు. ముంబైలోని టాటా మెమోరియల్ హాస్పిటల్‌లోని నేషనల్ బోర్డ్ ఇన్ రేడియేషన్ ఆంకాలజీలో డిప్లొమా చేసారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పిట్స్‌బర్గ్‌లో గామా నైఫ్ సర్జరీలో శిక్షణ పొందారు.
ప్రస్తుతం ఫ్లాగ్ ఆఫీసర్‌గా ఎంపికైన ఆర్తీ సరీన్ తన 38ఏళ్ళ కెరీర్లో ఎన్నో విశిష్ఠ పదవులు అలంకరించారు. పుణే ఆర్మీ హాస్పిటల్లోరేడియేషన్ ఆంకాలజీ విభాగంలో ప్రొఫెసర్‌గా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేసారు. ఐఎన్ఎచ్ఎస్ అశ్వని షిప్లో కమాండింగ్ ఆఫీసర్‌గా చేసారు. భారత నౌకాదళం దక్షిణ, పశ్చిమ నేవల్ కమాండ్స్‌లో కమాండ్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేసారు.
ఆర్తీ సరీన్ ప్రత్యేకత ఏంటంటే ఆమె మూడు సైనిక విభాగాల్లోనూ పనిచేసారు. ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ నుంచి కెప్టెన్ వరకూ హోదాల్లో పనిచేసారు. ఇండియన్ నేవీలో సర్జన్ లెఫ్టినెంట్ నుంచి సర్జన్ వైస్ అడ్మిరల్ వరకూ పనిచేసారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్మార్షల్గానూ పనిచేసారు.
వైద్యసేవల రంగంలో తన అంకితభావానికి గుర్తింపుగా వైస్ అడ్మిరల్ ఆర్తీ సరీన్ 2021లో విశిష్ఠ సేవామెడల్, 2024లో అతివిశిష్ఠ సేవామెడల్ గెలుచుకున్నారు. అంతేకాదు, 2017లో చీఫ్ ఆఫ్ ఆర్మీస్టాఫ్ కమెండేషన్, 2013లో జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ కమెండేషన్, 2001లో చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ కమెండేషన్ పురస్కారాలు పొందారు.
వైద్యవృత్తిలో ఉండేవారికి పని ప్రదేశాల్లో రక్షణ పరిస్థితులకు తగిన విధివిధానాల రూపకల్పన కోసం సుప్రీంకోర్టు ఇటీవల ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్‌ఫోర్స్‌లో ఆర్తీ సరీన్ సభ్యురాలిగా నియమితురాలయ్యారు కూడా.