వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలు ధ్వంసమని పునరుద్ఘాటన
కూటమి తరఫున ఎక్కువ మంది ఎంపీలను గెలిపించి ప్రజలు మంచి పనిచేశారని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీలో ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు నెలనెలా జీతాలు, అర్హులకు సామాజిక పింఛన్లు అందుతున్నాయన్నారు. సామాజిక పింఛను లబ్ధిదారులకు నెలకు రూ. 4 వేలు అందజేస్తున్నామన్నారు.
కర్నూలు జిల్లా పుచ్చకాయలమడ గ్రామంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారని మండిపడ్డారు. రూ.10 లక్షల కోట్ల అప్పులు చేశారని దుయ్యబట్టారు.
రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మారుస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, సోలార్, విండ్ పవర్ ఉత్పత్తి చేయడం ద్వారా 7.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. కర్నూలు నుంచి బళ్లారికి జాతీయ రహదారి నిర్మిస్తామన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీపావళి నుంచి మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేస్తామన్నారు.
వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసం అంతాఇంతా కాదు అన్నారు. పైసా ఖర్చు లేకుండా రాజముద్రతో పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇచ్చే బాధ్యత ఎన్డీయే ప్రభుత్వానిదన్నారు. రీ సర్వే పేరుతో ప్రజల భూముల సరిహద్దులు చెరిపేశారు వాటిని తమ ప్రభుత్వం సరిచేస్తుందన్నారు. ప్రభుత్వానికి వచ్చిన ఫిర్యాదుల్లో సగం భూ సమస్యలే ఉన్నాయన్నారు. రాయలసీమలో ప్రతీ ఎకరాకు నీళ్లివ్వాలనేది తన లక్ష్యం అన్నారు.