తిరుమలలో లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారనే ఆరోపణలపై దాఖలైన పిటీషన్ పై సుప్రీం కోర్టులో జరుగుతున్న విచారణ దరిమిలా సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఏపీ డీజపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరుఫున వాదిస్తున్న న్యాయవాదుల సూచన మేరకు విచారణను నిలిపివేశామని తెలిపారు.
అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.సుప్రీంకోర్టులో తదుపరి విచారణ అక్టోబరు 3 తర్వాత జరగనుంది.
తిరుమలలో ఈ నెల 4 నుంచి 12వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్ననేపథ్యంలో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. తిరుమలలో దొంగతనాలు, దోపిడీల నియంత్రణకు అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంటుందన్న డీజీపీ, 2 వేలకు పైగా సీసీ కెమెరాలను ఉపయోగిస్తున్నామని తెలిపారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా వచ్చే భక్తులు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా అవగాహన కల్పిస్తామన్నారు. ప్రయాణీకులకు భద్రతకు ఆర్టీసీ ప్రథమ ప్రాధాన్యం ఇస్తోందన్నారు.