కోల్కతాలోని ఆర్జి కర్ ఆస్పత్రి వైద్యకళాశాలలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన తర్వాత రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో భద్రతా పరిస్థితులను మెరుగు పరచాలని డిమాండ్ చేస్తూ పశ్చిమబెంగాల్ లోని జూనియర్ డాక్టర్లు మళ్ళీ సమ్మె బాట పట్టారు. ఈ ఉదయం పది గంటల నుంచీ పూర్తిస్థాయి సమ్మె ప్రారంభించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను తీర్చే దిశగా కనీస ప్రయత్నాలు చేయడం లేదంటూ వైద్యులు ఆరోపించారు.
మమతా బెనర్జీ ప్రభుత్వం మాత్రం తాము ఆందోళన చేస్తున్న వైద్యులతో చర్చలు జరిపామని, వారి డిమాండ్లలో కొన్నింటిని వెంటనే తీర్చడలేమని చెప్పింది. టాయిలెట్ల నిర్మాణం, సిసిటివి కెమెరాల ఏర్పాటుకు సమయం పడుతుందని వెల్లడించింది.
ఆర్జి కర్ ఆస్పత్రి సంఘటన తర్వాత 42 రోజులు సమ్మె చేసిన వైద్యులు, సెప్టెంబర్ 21న రాష్ట్రంలో వరద పరిస్థితుల నేపథ్యంలో విధుల్లో చేరారు. అదే సమయంలో సగోర్ దత్తా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఒక రోగి మరణించినప్పుడు ఆ రోగి బంధువులు వైద్యులను చితకబాదిన సంఘటన చోటు చేసుకుంది. దాంతో వైద్యుల భద్రత అంశం మళ్ళీ ముందుకొచ్చింది. తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించడం లేదంటూ వైద్యులు మళ్ళీ ఇవాళ్టి నుంచి సమ్మె మొదలుపెట్టారు.
‘‘మా ఆందోళనలు మొదలై ఇవాళ 52వ రోజు. ఇప్పటికీ మామీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశాల్లో మాకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చే దిశగా కనీసం ప్రయత్నాలైనా చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో మాకు సమ్మె మళ్ళీ మొదలుపెట్టడం మినహా గత్యంతరం లేదు’’ అని వైద్యులు చెబుతున్నారు.
రేపు గాంధీ జయంతి, మహాలయ పక్షాల ముగింపు, శరన్నవరాత్రుల ప్రారంభం సందర్భంగా కోల్కతాలో భారీ నిరసన ప్రదర్శన చేపడుతున్నామని వైద్యులు ప్రకటించారు.
ఆందోళన చేస్తున్న వైద్యులతో సమావేశమయ్యామని, అన్ని చోట్లా పనులు మొదలుపెట్టామనీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ చెప్పారు. మమతా బెనర్జీ కూడా రాష్ట్రంలోని వైద్యవిభాగం అధికారులు, అన్ని వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్ళు, వైస్ ప్రిన్సిపాళ్ళు, మెడికల్ సూపరింటెండెంట్లతో సమీక్షా సమావేశం నిర్వహించారని చెప్పారు. బాత్రూమ్ల నిర్మాణానికి, సిసిటివిల ఏర్పాటుకూ సమయం పడుతుంది. విషయం ఏంటంటే, ఆ దిశగా పనులైతే మొదలయ్యాయి. ఇది సమష్ఠిగా చేయవలసిన పని. ఫలితాలు కనిపిస్తాయి, ఆ విషయంలో అసహనం వద్దు’’ అని మనోజ్ పంత్ చెప్పుకొచ్చారు.
సుప్రీంకోర్టు సోమవారం నాటి విచారణలో వైద్యులకు భద్రత పనుల పురోగతి గురించి బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 26శాతం పనులు జరిగాయని, వరదల కారణంగా పనులు ఆగిపోయాయని, మిగిలిన పనులు అక్టోబర్ 15 నాటికల్లా పూర్తవుతాయనీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది.