ప్రముఖ హిందీ నటుడు గోవిందా ఈ ఉదయం ఆస్పత్రి పాలయ్యారు. తుపాకి మిస్‌ఫైర్ అయి కాలికి గాయం అవడంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చినట్లు ముంబై పోలీసులు ప్రకటించారు. ప్రస్తుతం నటుడి ప్రాణాలకు ప్రమాదం లేదు.
ముంబై జుహూ ప్రాంతంలోని గోవిందా నివాసంలో ఈ తెల్లవారుజామున సుమారు 4.45కు ఆయన దగ్గరున్న లైసెన్స్డ్ రివాల్వర్ మిస్‌ఫైర్ అయింది. తన ఆరోగ్యం బాగానే ఉందంటూ గోవిందా ఒక ఆడియో క్లిప్ విడుదల చేసారు. నా అభిమానులు, తల్లిదండ్రులు, గురువుల ఆశీర్వాదాలే తనను రక్షించాయన్నారు. తుపాకిగుండును తొలగించిన వైద్యులకు, తనకోసం ప్రార్థన చేసిన వారికీ కృతజ్ఞతలు చెప్పారు.
60 ఏళ్ళ నటుడు, శివసేన నాయకుడు అయిన గోవిందా ఆ సంఘటన జరిగినప్పుడు ఇంట్లో ఒక్కరే ఉన్నారు. కోల్‌కతా వెళ్ళడానికి సిద్ధమవుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. గోవిందా రివాల్వర్‌ను కప్‌బోర్డ్‌లో పెడుతుండగా జారి కింద పడిపోయింది, ప్రమాదవశాత్తు పేలడంతో తుపాకి గుండు మోకాలి కింద తగిలింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు గోవిందా ఇంటికి చేరుకుని ఆయనను క్రిటికేర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. కుమార్తె టీనా తండ్రితో ఉన్నారు. కోల్‌కతాలో ఉన్న గోవిందా భార్య సునీత, వెంటనే ముంబైకి బయల్దేరారు. గోవిందా ఈ విషయంలో ఎలాంటి ఫిర్యాదూ చేయలేదని పోలీసులు తెలియజేసారు.