దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణీకులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ ఆర్టీసీ) తీపికబురు చెప్పింది. దసరాకు సొంతూళ్ళక వెళ్ళేవారి కోసం అక్టోబర్ 4 నుంచి 20 వరకు 6 వేల 100 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. రాను పోను టికెట్ బుకింగ్ చేసుకున్న వారికి టికెట్ ధరలో 10 శాతం రాయితీ కూడా ఇవ్వనుంది.
దసరా పండుగ రద్దీ దృష్ట్యా ప్రతీ ప్రయాణీకుడినీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేలా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నవరాత్రుల్లో తిరుమల సహా అమ్మవారి ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివెళతారు. దీంతో ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రత్యేక బస్సుల్లో ఎక్కడా అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదని టికెట్ ఛార్జీలపై ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రత్యేక బస్సులకు గాను సాధారణ బస్సుల్లో ఛార్జీలనే వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి మధ్య నడిచే ఎసీ బస్సుల్లోనూ టికెట్ ఛార్జీపై పది శాతం రాయితీ అమలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది.
ఏపీలోని అన్ని జిల్లా కేంద్రాలు, సహా ముఖ్య నగరాలు, పట్టణాలు ,ఆధ్యాత్మిక కేంద్రాలకు అదనపు బస్సులు ఏర్పాటు చేసింది. విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, అనంతపురం, విజయనగరం, కాకినాడ, భీమవరం, అమలాపురం, కడప, శ్రీశైలం, మార్కాపురం, ఒంగోలు, తుని, శ్రీకాకుళం, నెల్లూరు , భద్రాచలం తదితర ప్రాంతాలకు బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ వెల్లడించింది.