అరసవల్లి దేవాలయంలోని మూలమూర్తిని సూర్యకిరణాలు తాకాయి. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి దేవాలయంలో శ్రీ సూర్యనారాయణ స్వామి మూలవిరాట్ను సూర్యకిరణాలు తాకాయి.
సూర్యోదయం సమయంలో పంచద్వారాలు, గాలిగోపురం మధ్య నుంచి ఆదిత్యుడిని కిరణాలు తాకాయి. ఈ అద్భుత ఘటనను చూసి భక్తులు పులకించిపోయారు. ఉదయం 6.05 గంటలకు కొన్ని నిమిషాలపాటు ఆవిష్కృతమైన ఈ అద్భుతాన్ని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రతీ ఏటా రెండు సార్లు ఇలాంటి అద్భుతం ఆవిష్కృతం అవుతుంది. ప్రతీఏటా మార్చి 9, 10 తేదీల్లో, అక్టోబర్ 1, 2 తేదీల్లో భక్తులకు ఈ అవకాశం లభిస్తుంది.
భాస్కరుడి విగ్రహాంపై పడిన లేలేత కిరణాలు దర్శనమివ్వడంతో జన్మధన్యమైందంటూ భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. సూర్యకిరణాలు తాకే సమయానికి సూర్యనారాయణమూర్తిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం.