నేపాల్‌లో నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దిగువనున్న బిహార్ భారీ వరదల్లో చిక్కుకుంది. బిహార్‌లోని పలు జిల్లాలు వరద గుప్పిట్లో ఇరుక్కున్నాయి. కోసి, వాల్మీకి నగర్ బ్యారేజీల నుంచి భారీ స్థాయిలో నీటికి కిందికి వదులుతుండడంతో లోతట్టు ప్రాంతాల్లో ప్రమాదకరస్థాయిలో గండ్లు పడే ప్రమాదం పొంచివుంది. గత 24 గంటల్లో లక్షల సంఖ్యలో ప్రజలు నిర్వాసితులయ్యారు. పంటపొలాలు నీటమునిగిపోయాయి.
ఎగువన ఉన్న నేపాల్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దిగువన ఉన్న బిహార్‌లోకి భారీస్థాయిలో వరద నీరు ప్రవహిస్తోంది. తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్, అరారియా, కిషన్‌గంజ్, గోపాల్‌గంజ్, శేవహర్, శరణ్, సహర్సా, దర్భంగా, సివాన్, పూర్ణియా, ముజఫర్‌పూర్, మధుబని, గోపాల్‌గంజ్, సీతామఢీ, సుపాల్ వంటి జిల్లాల్లో లక్షలాది ప్రజలు అష్టకష్టాల్లో చిక్కుకున్నారు.
సీతామఢి జిల్లాలో ఖైర్తవా, బేల్సుండ్ గ్రామాల దగ్గర ఏటిగట్లకు గండ్లు పడడంతో పశ్చిమ చంపారణ్, సీతామఢి జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో వేలాది మంది ప్రజలను ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ముజఫర్‌పూర్ జిల్లాలో కటారా బకూచీ పవర్గ్రిడ్లోకి వరదనీరు చేరి ఆ ప్రాంతమంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో 12 ఎన్డిఆర్ఎఫ్, 12 ఎస్డిఆర్ఎఫ్ బృందాలు సేవలందిస్తున్నాయి. మరో మూడు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు వారణాసి నుంచి బిహార్‌కు వెడుతున్నాయి. ఉత్తర బిహార్‌లో 43 పునరావాస కేంద్రాల్లో 12వేల మందికిపైగా వరద ప్రభావిత బాధితులకు ఆశ్రయం కల్పించారు. 9700 ప్యాకెట్ల డ్రై రేషన్ సరఫరా చేసారు. 18 సామూహిక వంటశాలల్లో వంటలు చేసి నిర్వాసితులకు పంచిపెడుతున్నారు. మునిగిపోయిన ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించడానికి 600 పడవలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి.
బిహార్ జలవనరుల శాఖ ఆదివారం సాయంత్రం విడుదల చేసిన నివేదికలో… గండక్, కోసి, మహానంద, బాగ్మతి నదుల్లో ఈ సీజన్లో అత్యధిక స్థాయిలో నీటి ప్రవాహం నమోదయింది. గండక్ బ్యారేజ్ నుంచి 5.62 లక్షల క్యూసెక్కులు, కోసి బ్యారేజ్ నుంచి 6.61 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేసారు. కోసి బ్యారేజ్‌లో గత 56ఏళ్ళలో అత్యధిక నీటి విడుదల ఇదేనని అధికారులు వెల్లడించారు.
గండక్, కోసి, మహానంద, బాగ్మతి, కమ్లా బాలన్ నదుల్లో నీటిస్థాయులు ఇంకా ప్రమాదకర స్థాయి కంటె ఎక్కువగానే ఉన్నాయి. కాలువగట్లు బలహీనపడిన చోట గండ్లు పడే అవకాశం ఉన్నందున యుద్ధప్రాతిపదికన వాటికి మరమ్మత్తులు చేస్తున్నారు.