తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం మీద సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనను సవాల్ చేస్తూ, భగవంతుణ్ణి రాజకీయాలకు దూరంగా ఉంచాలని సూచించింది. నెయ్యి విషయంలో కల్తీ గురించి చెబుతున్న నివేదిక జులై నెల నాటిదైతే ముఖ్యమంత్రి సెప్టెంబర్‌లో ఎందుకు వ్యాఖ్యలు చేసారని ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో దర్యాప్తు రాష్ట్రప్రభుత్వం నియమించిన సిట్ చేయాలా లేక మరో ఏజెన్సీకి ఆ బాధ్యత అప్పగించాలా అన్న విషయం మీద సుప్రీంకోర్టు అక్టోబర్ 3న తన ఆదేశాలు వినిపించే అవకాశముంది.
విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రప్రభుత్వం చూపిస్తున్న ఎన్డీడీబీ పరిశీలించిన నేతిని లడ్డూల తయారీలో వాడారా లేదా అన్న విషయం తెలియలేదని సుప్రీంకోర్టు గమనించింది. నాసిరకం నెయ్యితో లడ్డూలు చేసారా అని ప్రశ్నించింది. ఆ విషయాన్ని ఇంకా దర్యాప్తు చేయాలని టిటిడి ప్రతినిధి చెప్పగా, అలాంటప్పుడు నాసిరకం నెయ్యితో లడ్డూలు తయారు చేసారనడానికి ఆధారాలేమి ఉన్నాయని ప్రశ్నించింది. ఎన్డీడీబీ నివేదిక తర్వాత సెకెండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది.
ఈ వ్యవహారంపై దర్యాప్తుకు రాష్ట్రప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసినప్పుడు ఆ సిట్ నివేదిక రాకముందే ముఖ్యమంత్రి మీడియా ముందు చెప్పాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించింది. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని గుర్తు చేసింది. సిట్ దర్యాప్తు ఫలితాల మీద నమ్మకం లేకపోతే మీరు ఎలా ప్రకటన చేసారు? మీరు ముందే ప్రకటన చేసేస్తే ఇంక దర్యాప్తుకు అర్ధమేముంటుంది? అని ప్రశ్నించింది.
లడ్డూలో నాసిరకం నెయ్యి ఆరోపణల వ్యవహారం మీద బీజేపీ నేత సుబ్రమణ్యం స్వామి, టిటిడి మాజీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసారు. స్వయంగా రాష్ట్రముఖ్యమంత్రే చేసిన ఆరోపణలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తుల్లో ఆందోళన నెలకొందని, అందువల్ల ఆ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలనీ వారు కోరారు. ఆ దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఒక కమిటీ నియమించాలని కోరారు.