ఆవును ‘రాష్ట్ర మాత’గా ప్రకటిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. భారతీయ సంప్రదాయంలో ఆవుకు ఉన్న సాంస్కృతిక ప్రాధాన్యత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహారాష్ట్ర సర్కారు వెల్లడించింది. ఏకనాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం ఈ మేరకు విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వులో (జీఓ) స్పష్టం చేసింది.
గోవుకు ఆధ్యాత్మిక, వైజ్ఞానిక, సైనిక రంగాల్లో అమితమైన ప్రాధాన్యత ఉందని ప్రస్తావించింది. భారతదేశంలో ఎన్నోరకాల దేశవాళీ ఆవులు ఉండేవి. అలాంటి దేశీ ఆవుల సంఖ్య నానాటికీ తగ్గిపోతోందంటూ మహారాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. వ్యవసాయంలో ఆవుపేడను వాడడం వల్ల భూమిలో సారం పెరిగి, ఆహార పంటల్లో పోషక విలువలు పెరుగుతాయంటూ మహారాష్ట్ర ప్రభుత్వం తమ అధికారిక ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొంది. ధార్మికంగానూ, సాంస్కృతికంగానే కాక సామాజిక, ఆర్థిక పరంగా కూడా ఆవుల, వాటి నుంచి వచ్చే ఉత్పత్తులకు ఉన్న విలువను గుర్తించాలని, దేశవాళీ ఆవులను పెంచి పోషించాలనీ మహా సర్కారు పిలుపునిచ్చింది.
భారతదేశంలో, హిందూ ధర్మంలో గోవును తల్లిగా భావించి పూజించడం ఆనవాయితీ. ఆవు పాలు, మూత్రం, పేడ పవిత్రమైనవని భావిస్తాం, వాటిని విస్తారంగా వినియోగిస్తాం. మన శరీరానికి ఆవుపాలు చాలా లాభదాయకం. ఆవు పాలు శరీరానికి చాలా మంచివి. ఇక గోపంచకాన్ని ఎన్నో రకాల వ్యాధుల నియంత్రణలో ఉపయోగిస్తారు.