ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజా జిల్లాలో, క్రైస్తవంలోకి మతం మారిన సుమారు వందమంది గిరిజనులు తిరిగి సనాతన ధర్మంలోకి వచ్చారు. జిల్లా కేంద్రం అంబికాపూర్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో 22 కుటుంబాలకు చెందిన వందమంది ఘర్ వాపసీ అయ్యారు. శంకరాచార్య స్వాగత సమితి నిర్వహించిన మూడు రోజుల ‘విశాల్ హిందూ రాష్ట్ర ధర్మ సభ’ ధార్మిక సదస్సు ఆదివారం ముగింపు కార్యక్రమంలో ఈ ఘర్‌వాపసీ జరిగింది.
పూరీలోని ఋగ్వేద గోవర్ధన మఠం పీఠాధిపతి స్వామి నిశ్చలానంద సరస్వతి, అఖిల భారత ఘర్ వాపసీ ప్రచార కార్యక్రమ నిర్వాహకుడు ప్రబల్ ప్రతాప్ జుదేవ్… స్వధర్మంలోకి తిరిగి వచ్చిన గిరిజనులను పూలదండలతో ఆహ్వానించారు. ఆ గిరిజనుల పూర్వీకులు తమ ప్రాంతాల్లో క్రైస్తవుల మత ప్రచారానికి ఆకర్షితులై ఆ ధర్మంలోకి వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ సనాతన ధర్మం గొప్పదనం తెలుసుకుని వెనక్కి వచ్చారు.
ఆ సందర్భంగా స్వామి నిశ్చలానంద సరస్వతి మాట్లాడుతూ అక్రమ మతమార్పిడులను, గోవధనూ నిషేధిస్తూ కఠినమైన చట్టాలు చేయాలని కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.
ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజా జిల్లాలో గిరిజనుల జనాభాయే ఎక్కువ. క్రైస్తవ మిషనరీలు వారిని లక్ష్యంగా చేసుకుని, వారి అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని, ఆ గిరిజనులను అక్రమంగా మతం మార్చేవారు. కొన్ని తరాల పాటు అలా గిరిజనులను మతం మార్చేయడం వల్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో జనస్వరూపం (డెమొగ్రఫీ) తారుమారైపోయింది.
స్థానిక హిందూ కార్యకర్తలు చెప్పేదేంటంటే… ఆ ప్రాంతంలో క్రైస్తవ మతంలోకి మారిన వారంతా గిరిజనులే. వాళ్ళు ఇప్పటికీ రిజర్వేషన్ ఫలాలు పొందడం కోసం ప్రభుత్వ పత్రాల్లో తమను తాము హిందువులనే చెప్పుకుంటారు. నిజానికి ఆ ప్రాంతంలో మిషనరీలు ప్రలోభపెట్టి క్రైస్తవంలోకి మతం మార్చిన గిరిజనులే ఎక్కువ.
ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనులను క్రైస్తవంలోకి మారుస్తున్న మిషనరీల ఆగడాలను అరికట్టడానికి హిందూ కార్యకర్తలు పెద్దయెత్తున ఘర్‌వాపసీ కార్యక్రమాలు తరచుగా నిర్వహిస్తున్నారు. మిషనరీల ప్రలోభాలకు లొంగిపోయి క్రైస్తవం తీసుకున్న వారు, మళ్ళీ స్వధర్మంలోకి వచ్చేలా ఆ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.