ప్రముఖ నటుడు మిథున్ చక్రబొర్తిని ఈ యేటి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. ఆ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘ఎక్స్’ మాధ్యమం ద్వారా ప్రకటించారు.
‘‘మిథున్ దా గొప్ప సినీ ప్రయాణం తరతరాలకూ స్ఫూర్తిదాయకం. శ్రీ మిథున్ చక్రబొర్తి భారతీయ సినిమాకు అందించిన గొప్ప సేవలకు గుర్తింపుగా ఆయనకు అవార్డు ఇవ్వాలని దాదాసాహెబ్ ఫాల్కే సెలక్షన్ జ్యూరీ నిర్ణయించింది. ఆ విషయాన్ని ప్రకటించడం నాకు గర్వకారణం’’ అని అశ్వినీ వైష్ణవ్ ట్వీట్ చేసారు.
2024 అక్టోబర్ 8న జరిగే 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో మిథున్ చక్రబొర్తికి దాదాఫాల్కే అవార్డ్ అందజేస్తారు.
74ఏళ్ళ మిథున్ చక్రబొర్తి ఈ పురస్కార ప్రకటనపై స్పందించారు. ‘‘నా అనుభూతిని చెప్పడానికి మాటల్లేవు. నా ఆనందాన్ని వెల్లడించడానికి నవ్వలేను, ఏడ్వలేను. కోల్కతా సందుల్లోనుంచి వచ్చిన ఓ కుర్రాడు ఈ స్థితికి చేరుకుని ఇంతపెద్ద గౌరవం పొందుతున్నాడు. నేను దీన్ని ఊహించలేదు. నా ఆనందానికి అవధుల్లేవు. ఈ పురస్కారాన్ని నా కుటుంబానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా అభిమానులకూ అంకితమిస్తున్నాను’’ అన్నారు.
దాదాఫాల్కే అవార్డు విజేత మిథున్ చక్రబొర్తిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందించారు. భారత సినిమాకు మిథున్ దా సేవలు అమూల్యమైనవని ప్రధాని అన్నారు. ‘ఆయన ఒక సాంస్కృతిక చిహ్నం, తన వైవిధ్యభరితమైన ప్రదర్శనలతో ఎన్నో తరాలను అలరించారు’ అంటూ మిథున్ దాను మోదీ ప్రశంసించారు.
ఈ యేడాది ప్రారంభంలో మిథున్ చక్రబొర్తికి పద్మభూషణ్ పురస్కారం లభించింది. మిథున్ దా తన సినీ కెరీర్ను 1976లో మృగయా చిత్రంతో ప్రారంభించారు. మృణాల్ సేన్ దర్శకత్వం వహించిన ఆ చిత్రం జాతీయ అవార్డులు గెలుచుకుంది. ఆ సినిమాలో తన నటనకు మిథున్ చక్రబొర్తి తన మొదటి జాతీయ చలనచిత్ర ఉత్తమ నటుడి పురస్కారం గెలుచుకున్నారు. సురక్షా, డిస్కో డాన్సర్, డాన్స్ డాన్స్, ప్యార్ ఝుక్తా నహీ, కసమ్ పైదా కర్నేవాలే కీ, కమాండో తదితర చిత్రాలతో మిథున్ దా భారతీయులను రంజింపజేసారు. దశాబ్ద కాలంలో వందకు పైగా చిత్రాల్లో నటించి రికార్డు సృష్టించారు.