లెబనాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను తుదముట్టించిన ఇజ్రాయెల్, అదే ఊపులో ఆదివారం కూడా లెబనాన్‌పై గగనతల దాడులు కొనసాగించింది. ఆ దాడుల్లో 105మంది చనిపోయారని, 359 మంది గాయపడ్డారనీ లెబనాన్ ప్రకటించింది.
లెబనాన్ దక్షిణ భాగంలోని సిడాన్ నగరం చేరువలో ఇజ్రాయెల్ గగనతల దాడులు చేసిందని లెబనాన్ ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశం తూర్పు, దక్షిణ భాగాలతో పాటు రాజధాని బీరూట్‌లోనూ ఆ నగరం చుట్టుపక్కలా ఇజ్రాయెల్ గగనతల దాడులు చేపట్టింది. వాటిలో డజన్ల కొద్దీ లెబనాన్ సైనికులు, ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఉదయం జరిగిన దాడిలో బీరూట్ దగ్గర నలుగురు వ్యక్తులు చనిపోయారు. ఇరాన్ అండ ఉన్న హెజ్బొల్లా ఇజ్రాయెల్ మీద సరిహద్దుల దగ్గర మొదటి దాడి చేసింది. గత అక్టోబర్ 7న ఇజ్రాయెలీ పట్టణాలపై హమాస్ దాడులకు పాల్పడింది. దాంతో గాజా యుద్ధం మొదలైంది.
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఉదయం ఒక ఫ్రెంచ్ మహిళ ప్రాణాలు కోల్పోయింది. దానితో కలుపుకుని ఇప్పటివరకూ ఇద్దరు ఫ్రెంచ్ జాతీయులు చనిపోయారని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ నోయెల్ బారో ప్రకటించారు. ఆయన ప్రస్తుతం లెబనాన్‌లో పర్యటిస్తున్నారు. ఇజ్రాయెల్ దాడులు ముమ్మరమైన తర్వాత లెబనాన్‌లో పర్యటిస్తున్న మొదటి విదేశ ప్రతినిధి ఆయనే.
రెండు వారాల క్రితం హెజ్బొల్లాను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇప్పటివరకూ తమ దేశంలో వెయ్యి మంది చనిపోయారనీ, 6 వేలమందికి పైగా గాయపడ్డారనీ లెబనాన్ ప్రకటించింది.
ఇజ్రాయెల్ దాడిలో హతమైన హెజ్బొల్లా చీఫ్ సయ్యద్ హసన్ నస్రల్లా మృతదేహాన్ని లెబనాన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బీరూట్‌లోని ఒక భూగృహంలో దాగిఉన్న నస్రల్లాను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేసిన సంగతి తెలిసిందే. నస్రల్లా మృతదేహం మీద ఎలాంటి గాయాలూ లేవని, బంకర్ మీద బాంబుల పేలుడు ధాటికి చనిపోయారని తెలుస్తోంది. ఆ దాడిలో నస్రల్లాతో పాటు మరో 20మంది హెజ్బొల్లా సభ్యులు మరణించారని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతాలను సురక్షితంగా ఉంచడమే లక్ష్యంగా హెజ్బొల్లాను తుడిచిపెడతామనీ, ఆ క్రమంలో లెబనాన్ మీద దాడులు కొనసాగిస్తామనీ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు.