ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపుతోంది. గత ఏడాది మెట్ల మార్గంలో ఓ బాలికపై చిరుత దాడి చేయడంతో మృతి చెందింది. ఆ తర్వాత కూడా పలుమార్లు చిరుత తిరుమలలోని కొన్ని ప్రదేశాల్లో సంచరించింది. ఆ విషయం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. అప్పట్లో టీటీడీ, భక్తుల సంరక్షణ కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా కొన్ని చిరుతలను పట్టుకుని జూలో వదిలిపెట్టారు.
తాజాగా శనివారం రాత్రి తిరుమల నడకమార్గంలో చిరుత సంచారంతో భద్రతా సిబ్బంది పరుగులు పెట్టారు. శ్రీవారి మెట్ల మార్గంలోని కంట్రోల్ రూమ్ వద్దకు ఓ చిరుత రాగా కుక్కలు దానిని వెంబడించాయి. సెక్యూరిటీ సిబ్బంది భయంతో కంట్రోల్ రూమ్ లోపలికి వెళ్లి దాక్కోవాల్సి వచ్చింది. అనంతరం అటవీ అధికారులకు సమాచారం అందడంతో వారు అక్కడికి చేరుకున్నారు.
తిరుమల స్వామివారిని ప్రతీరోజు లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. కొండపైకి చాలా మంది భక్తులు నడక మార్గంలో వెళుతుంటారు. ఆయా మార్గాల్లో చిరుతలు, ఇతర అడవి జంతువులు సంచరించడంతో భక్తులు భయాందోళన చెందుతున్నారు.