తెలుగువారికి అత్యంత ఇష్టుడైన దేవుడు తిరుమల శ్రీనివాసుడు. అందుకే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ పేరు పెట్టుకున్నవారు చాలామందే ఉంటారు. అలాంటి శ్రీనివాస నామధేయులు ఒకచోట కలిస్తే ఎలా ఉంటుంది? అందరూ కలిసి శ్రీనివాసుడికి సేవ చేసుకుంటే ఎలా ఉంటుంది? అలాంటి ప్రయోగం చేసారొక శ్రీనివాసుడు.
తెలంగాణ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో దైవజ్ఞ శ్రీనివాస్ అనే వ్యక్తి నివసిస్తున్నారు. ఆయనకు, శ్రీనివాసుడి పేరుతో ఉన్న వ్యక్తులందరినీ ఒకచోట కలపాలనే ఆలోచన వచ్చింది. ‘మనమంతా శ్రీనివాసులమే’ పేరుతో ఆయన వాట్సప్‌లో ఒక గ్రూప్ ప్రారంభించారు. అదే పేరు కలిగిన వందల మందిని ఆ సమూహంలోకి తీసుకొచ్చారు. వారందరూ ఆ గ్రూప్‌లో తమ వ్యక్తిగత, వృత్తిగత జీవితాల గురించి చర్చించుకుంటూంటారు.
ఇటీవల ఆధునిక పోకడలు పెరిగాక శ్రీనివాస్ అనే పేరు పెట్టుకోవడం తగ్గుతోందని వారు భావించారు. ఆ పేరు గొప్పదనాన్ని చాటేలా ఏదైనా కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించుకున్నారు. దానికి కరీంనగర్ నివాసి వూటుకూరి శ్రీనివాసరెడ్డి కార్యరూపం ఇచ్చారు. తమ జిల్లాకు చెందిన, అదే పేరున్న వారితో ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసారు. ‘కరీంనగర్ శ్రీనివాసులం’ అనే ఆ గ్రూప్ సభ్యులు సమావేశమయ్యారు. కరీంనగర్ పట్టణం విద్యానగర్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం నాడు సుమారు 150 మంది శ్రీనివాసులు సమావేశమయ్యారు. ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. స్వామి సన్నిధిలో ఆనందంగా సమయం గడిపారు. అర్చకులు సైతం ఈ విభిన్న సమూహాన్ని చూసి సంతోషించి ప్రత్యేకంగా పూజాదికాలు చేసారు.
‘‘తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శ్రీనివాస్ పేరున్న వేలమందిని సమీకరిస్తాం. వారందరితో కలిసి, త్వరలో సమావేశం నిర్వహిస్తాం. మా గ్రూపు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా చేస్తోంది. గ్రూపు ఏర్పాటైనప్పటినుంచీ రక్తదానం చేస్తున్నాం. ఇప్పటికి 200 యూనిట్లకు పైగా రక్తం దానం చేసాం. తలసీమియా బాధితుల కోసం ఏడాదిలో మూడు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు వేస్తున్నాం. శ్రీనివాసుడి పేరున్న మేమందరం ఒక బృందంగా తిరుమల దర్శనానికి వెళ్ళడానికి ఆలోచిస్తున్నాం’’ అని నిర్వాహకులు చెబుతున్నారు.
శ్రీనివాసులను కలిపేందుకు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మూడు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసారు. వాటి ద్వారా ఇప్పటివరకూ 2360 మంది శ్రీనివాసులు మిత్రులయ్యారు. ఇదంతా స్వామి కరుణే అని వారు భావిస్తున్నారు.