జమ్మూకశ్మీర్‌లో కుల్గామ్ జిల్లా పరిధిలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.ఆదిగామ్ ప్రాంత పరిధిలో ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారం అందడంతో ఆర్మీ, కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి.
భద్రతా దళాల రాకను గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే తేరుకున్న పోలీసులు, సైన్యం కూడా ఎదురుకాల్పులు జరిపారు. దీంతో బుల్లెట్లు తగిలి ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. నలుగురు జవాన్లు, ఓ పోలీస్ అధికారి గాయపడినట్లు అధికారులు ప్రకటించారు. గాయపడిన వారు కుల్గామ్ అదనపు ఎస్పీ ముంతాజ్ అలీ భట్టి, రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన జవాన్లు మోహన్ శర్మ, సోహన్ కుమార్, యోగిందర్, మహ్మద్ ఇస్రాన్‌లుగా అధికారులు గుర్తించారు. వారిని చికిత్స కోసం శ్రీనగర్‌లోని 92 బేస్ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.మరోవైపు భారీగా మోహరించిన భద్రతా సిబ్బంది ఉగ్రవాదుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత పదేళ్ళకు జమ్ముకశ్మీర్‌లో శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. మూడు దశల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే రెండు దశల పోలింగ్ ముగియగా అక్టోబర్ 1న మూడో దశ పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఫలితాలు వెల్లడవుతాయి.