ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై పూర్తిస్థాయి మాటల దాడులు చేస్తున్నారు. జమ్మూకశ్మీర్ ఎన్నికల ప్రచారపర్వంలో భాగంగా ఆయన కాంగ్రెస్‌ను తీవ్రంగా నిందించారు. సొంత దేశపు ప్రజలను అవమానిస్తూ, విదేశీ చొరబాటుదారులను దేశంలోకి ఆహ్వానించి వారిని ఓటుబ్యాంకులుగా మలచుకునే నికృష్ట మనస్తత్వం కాంగ్రెస్‌ది అని మండిపడ్డారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అర్బన్ నక్సలైట్ల నియంత్రణలోకి వెళ్ళిపోయిందని వ్యాఖ్యానించారు.
జమ్మూలో ఓ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన మోదీ ‘‘మన వీరసైనికుల త్యాగాలను కాంగ్రెస్ ఎప్పుడూ గౌరవించలేదు. ఆ పార్టీని ఇవాళ అర్బన్ నక్సలైట్ల సానుభూతిపరులు హైజాక్ చేసారు. వారు విదేశీ చొరబాటుదారులను దేశంలోకి ఆహ్వానిస్తారు, వారిని ఓటుబ్యాంకులుగా మలచుకుంటారు. మన దేశపు నిజమైన ప్రజలు కష్టపడుతుంటే వారిని అపహాస్యం చేస్తారు’’ అంటూ మండిపడ్డారు.
‘‘జమ్మూకశ్మీర్‌లో చోటు చేసుకుంటున్న మార్పులను ఆ మూడు పార్టీలనూ తట్టుకోలేకపోతున్నాయి. మీ అభివృద్ధి వారికి ఇష్టం లేదు. వాళ్ళ ప్రభుత్వం ఏర్పడితే మళ్ళీ పాత పద్ధతిని తీసుకొస్తామంటున్నారు. వాళ్ళే అధికారంలోకి వస్తే అదే వివక్షాపూరిత పరిపాలనను తీసుకొస్తారు. వారివల్ల అత్యధికంగా నష్టపోయేది మన జమ్మూయే. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ మూడు పార్టీలూ జమ్మూకు ఎప్పుడూ అన్యాయమే చేస్తూ వచ్చాయి. బుజ్జగింపు రాజకీయాల కోసం వారు ఏమైనా చేయగలరు. మీరు అతని ప్రసంగాలు వినాల్సిందే. డోగ్రా వారసత్వం మీద అతను ఎలా దాడి చేస్తాడో, మహారాజా హరిసింగ్‌ను అవమానించడానికి ఎలాంటి ఆరోపణలు చేస్తాడో తెలుసుకోవలసిందే’’ అంటూ విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ తప్పుడు విధానాలు, నిర్లక్ష్యం, ఉదాసీనత వల్ల జమ్మూకశ్మీర్ ప్రజలు స్వతంత్రం వచ్చిననాటినుంచీ ఎన్నో అవస్థలు పడుతూనే ఉన్నారని మోదీ చెప్పుకొచ్చారు. ‘‘దశాబ్దాలుగా కాంగ్రెస్, ఎన్‌సి, పిడిపి పార్టీలు తమ నాయకుల, తమ కుటుంబాల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చాయి. జమ్మూకశ్మీర్ ప్రజలు ఎంత కష్టపడుతున్నా పట్టించుకోలేదు’’ అని మండిపడ్డారు.
బిజెపి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని సమృద్ధం చేసేందుకు శరవేగంగా పనిచేస్తుందని మోదీ చెప్పారు. స్థానికులకు ఇన్నాళ్ళూ జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతామని హామీ ఇచ్చారు.
‘‘ఇవాళ కాంగ్రెస్ పూర్తిగా అర్బన్ నక్సలైట్ల నియంత్రణలో ఉంది. విదేశాల నుంచి చొరబాటుదార్లు వస్తే కాంగ్రెస్‌కు ఇష్టం. వారిలో ఆ పార్టీ ఓటుబ్యాంకును చూసుకుంటుంది. కానీ వారు మన సొంత ప్రజల ఈతిబాధలను చూసి అపహాస్యం చేస్తారు. కాంగ్రెస్, ఎన్‌సి, పిడిపి మూడు పార్టీలూ రాజ్యాంగానికి శత్రువులు. వాళ్ళు రాజ్యాంగ స్ఫూర్తిని చంపేసారు. ఎన్నో తరాలుగా జమ్మూలో నివసిస్తున్న ఎన్నో కుటుంబాలకు నేటికీ ఓటుహక్కు లేదు. వారికి ఆ హక్కును కాంగ్రెస్, ఎన్‌సి, పిడిపి లేకుండా చేసాయి’’ అని దుయ్యబట్టారు.
2016లో తమ ప్రభుత్వం పాకిస్తాన్ మీద చేసిన సర్జికల్ స్ట్రైక్‌ను విమర్శించిన, ఆ దాడులకు సాక్ష్యాధారాలు అడిగిన కాంగ్రెస్‌ను ఆయన తప్పుపట్టారు. ‘‘మనది నవభారతం. మనం శత్రువు ఇంట్లోకి చొరబడి మరీ వాళ్ళను చంపుతాం’’ అంటూ పీఎం మోదీ, సాయుధ బలగాలు ఉగ్రవాద బృందాలపై దాడులు చేయడాన్ని వివరించారు.
‘‘మీకు గుర్తుందా, అటువైపు నుంచి తూటాలు కాల్చిన మరుక్షణమే కాంగ్రెస్ తెల్లజెండా ఎగరేసేది. శత్రువుల బులెట్లకు భారత్ షెల్స్‌తో జవాబిచ్చేసరికి అటువైపు ఉన్న ప్రజల మత్తు వదిలిపోయింది’’ అని చెప్పారు.
‘‘2016లో సరిగ్గా ఇదే రోజు సర్జికల్ దాడి జరిగింది. ఇండియా ప్రపంచానికి ‘మాది నవభారతం, శత్రువు ఇళ్ళలోకి చొరబడి మరీ చంపేస్తాం’ అన్న సందేశాన్ని ప్రపంచానికి అందించగలిగాం’’ అని మోదీ వివరించారు.
జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ సమావేశాలకు మూడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి దశ సెప్టెంబర్ 18న, రెండో దశ సెప్టెంబర్ 25న పూర్తయ్యాయి. చివరిదైన మూడోదశ ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 1న జరుగనుంది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు