ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా అధిపతి హసన్ నస్రల్లా హతమయ్యాడని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. లెబనాన్ రాజధాని బీరూట్ మీద ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో నస్రల్లా చనిపోయాడని వెల్లడించింది. 64ఏళ్ళ నస్రల్లా శుక్రవారం రాత్రి నుంచీ అందుబాటులోకి రాలేదని హెజ్బొల్లా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ నదావ్ షోషానీ, సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ‘‘హసన్ నస్రల్లా చనిపోయాడు’ అని ప్రకటించాడు.
ఇజ్రాయెల్ తూర్పు భాగంలోకి హెజ్బొల్లా సంస్థ రాకెట్లతో దాడి చేసింది. దానికి ప్రతిగా లెబనాన్ తూర్పు, దక్షిణ భాగాల్లోని డజన్ల కొద్దీ హెజ్బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ గగనతల దాడులు చేసింది. దక్షిణ బీరూట్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్‌కు చెందిన జెట్‌ఫైటర్లు గతరాత్రి బాంబుల వర్షం కురిపించాయి.
‘‘హసన్ నస్రల్లా ఇంకెంతమాత్రం ఈ ప్రపంచాన్ని భయపెట్టలేడు’’ అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది. ‘‘ఇదే మా ఆఖరు అస్త్రం కాదు. మా సందేశం చాలా సరళం. ఇజ్రాయెల్ పౌరులను ఎవరైనా బెదిరిస్తే, వారిని ఎలా చేరుకోవాలి, ఏం చేయాలి అన్నది మాకు బాగా తెలుసు’’ అని లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవీ వ్యాఖ్యానించారు.
ఇజ్రాయెల్ ఉత్తరభాగం మీద రాకెట్లు ప్రయోగించినది తామేనని హెజ్బొల్లా ప్రకటించిన కొద్ది గంటలకే ఇజ్రాయెల్ ప్రతిదాడులకు పాల్పడింది.
నస్రల్లా లెబనాన్‌లో అత్యంత శక్తివంతుడు. ప్రత్యేకించి షియా వర్గాలకు అతను ఆరాధ్యుడు. యుద్ధం చేయాలన్నా, శాంతి రాయబారాలు జరపాలన్నా నస్రల్లాతోనే సాధ్యమని ఆ దేశ ప్రజలు భావిస్తారు.
64ఏళ్ళ నస్రల్లా కుమార్తె జైనాబ్ కూడా, దక్షిణ బీరూట్ మీద జరిగిన వైమానిక దాడిలో ప్రాణాలు కోల్పోయిందని ఇజ్రాయెల్‌కు చెందిన చానెల్ 12 వెల్లడించింది. అయితే హెజ్బొల్లా కానీ, లెబనాన్‌కు చెందిన మీడియా కానీ ఆ సంఘటనను ధ్రువీకరించలేదు.
‘‘నస్రల్లా, హెజ్బొల్లా సంస్థకు 32ఏళ్ళు ప్రధాన కార్యదర్శిగా పనిచేసారు. ఆ హోదాలో అతను ఎంతోమంది ఇజ్రాయెల్ సామాన్య పౌరులు, సైనికులను హతమార్చి చంపాడని నస్రల్లా మీద ఆరోపణలున్నాయి. అతను వేల సంఖ్యలో ఉగ్రవాద కార్యకలాపాలకు రూపకల్పన చేసి వాటిని అమలుపరిచాడు’’ అని ఇజ్రాయెల్ చెప్పింది.
‘‘ఉగ్రవాదులను చేరదీసి, వారికి శిక్షణ ఇచ్చి, తమ దారిలో అడ్డొచ్చే వారిని హత్య చేయించేవాడు. అలాంటి దాడుల్లో విదేశీయులు, వివిధ దేశాలకు చెందిన పౌరులూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా అతను జరిపించిన ఉగ్రదాడుల్లో ఎంతోమంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. హెజ్బొల్లా సంస్థలో కీలక నిర్ణాయక శక్తి, వ్యూహాత్మక నాయకుడూ అతనే’’ అని ఇజ్రాయెల్ వివరించింది.
పరిస్థితులు మరింత తీవ్రంగా మారతాయన్న అంచనాలతో బీరూట్ దక్షిణ భాగంలోని శివారు ప్రాంతాల్లోని ఆస్పత్రులను ఖాళీ చేయాలని లెబనాన్ వైద్యఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎమర్జెన్సీ కాని రోగులను చేర్చుకోవద్దని ఆస్పత్రులకు సూచించింది. ఘర్షణ జరుగుతున్న ప్రాంతాల నుంచి ప్రజలను తరలించాక, వారికి ఆ ఆస్పత్రుల్లో ఆశ్రయం ఇస్తారు.
లెబనాన్ మీద ఇజ్రాయెల్ బాంబింగ్‌లో 7వందల మందికి పైగా చనిపోయారు. సుమారు లక్షా 18వేల మంది దేశంలోని వివిధ ప్రాంతాలకు పారిపోయారు.