జగన్ అనే పేరు పెట్టుకున్నందుకు జగన్నాటకాలు ఆడుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి యామినీ శర్మ మండిపడ్డారు. డిక్లరేషన్ మీద సంతకం పెట్టమంటే మానవతావాది, లౌకికవాది అయిపోతారా అని నిలదీసారు. తిరుమల ఆలయానికి తనను రానివ్వడం లేదంటూ కూటమి ప్రభుత్వంపై జగన్ చేసిన ఆరోపణల మీద ఆమె ఘాటుగా స్పందించారు.
తిరుమల దేవాలయానికి తనను రాకూడదన్నారంటూ జగన్ చెప్పడాన్ని యామిని తప్పుపట్టారు. ఆలయానికి ఏ మతస్తులైనా రావచ్చు కానీ అక్కడ ఉన్న నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనన్నారు. ‘‘నాలుగు గదుల్లో కాకపోతే నలభై గదుల్లో బైబిల్ చదువుకోండి, కానీ తిరుమల గుడికి వెళ్ళేటప్పుడు హిందూ ధర్మాల నియమ నిబంధనలు పాటించాలి. రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలో తెలుసు కానీ ధర్మాన్ని ఎలా పాటించాలో తెలీదా? లౌకికవాదం పేరుతో కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. హిందువుల మధ్య వివాదాలు రేకెత్తించేందుకు జగన్ కుట్ర పన్నుతున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కల్పించేలా వ్యాఖ్యలు చేస్తున్నారు’’ అని యామిని మండిపడ్డారు.‘‘అంతర్వేది ఆలయంలో రధం దగ్ధమైనప్పుడు ఎందుకు బైటకు వచ్చి మాట్లాడలేదు? ఆనాడు హిందువుల పక్షాన నిలబడి ఎందుకు పోరాడలేదు’’ అని నిలదీసారు.
జగన్ తన ప్రసంగంలో బీజేపీకి సంధించిన ప్రశ్నలకు యామిని స్పందించారు. లడ్డూ వ్యవహారంలో పార్టీ జాతీయ అధ్యక్షులు, కేంద్ర మంత్రులూ మాట్లాడారని గుర్తు చేసారు. జగన్ హయాంలో దేవదాయ భూములు ఎన్ని ఎకరాలు దోచుకున్నారోనని మండిపడ్డారు. జగన్ సనాతన ధర్మాన్ని ఆచరించకపోగా కనీసం గౌరవించడం లేదని ఆరోపించారు. దళితుడిని చంపిన అనంతబాబును పక్కనే పెట్టుకుని, దళితులను ఆలయంలోకి రానివ్వడం లేదంటూ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్ పాలనాకాలంలో మహిళలపై లైంగిక వేధింపులు, మహిళని ఈడ్చుకువెళ్ళిన సంఘటనలూ చాలా జరిగాయని గుర్తు చేసారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం హిందూ ధర్మాలను కాపాడుతుందని, దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తుందని యామిని చెప్పుకొచ్చారు.