ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో పాకిస్తాన్ ప్రధానమంత్రి షెబాజ్ షరీఫ్ తన ప్రసంగంలో జమ్మూకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. దాని తర్వాత మాట్లాడిన భారత ప్రతినిధి, పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరిక ఇచ్చారు. సరిహద్దుల వెంబడి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్, తప్పనిసరిగా దానికి తగిన తీవ్ర పర్యవసానాలను ఎదుర్కొంటుందని హెచ్చరించారు.
ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధి భవికా మంగళానందన్, తన ప్రసంగంలో పాకిస్తాన్‌ను అంశాలవారీగా నిలదీసారు. ప్రపంచ ఉగ్రవాదంలో పాకిస్తాన్ భాగస్వామి అని మండిపడ్డారు. సరిహద్దుల వెంబడి ఉగ్రవాదాన్ని ఉపయోగించడాన్ని ప్రభుత్వ విధానంగా ప్రోత్సహించిన చరిత్ర పాకిస్తాన్‌కు ఉందని గుర్తుచేసారు.
పాకిస్తాన్ ప్రధానమంత్రి షెబాజ్ షరీఫ్ తన ప్రసంగంలో భారతదేశం తమ రాజ్యాంగంలోని 370వ అధికరణం రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే 370 అధికరణాన్ని పునరుద్ధరించాలన్నారు. ఇరుదేశాల మధ్యా చర్చలను మళ్ళీ మొదలుపెట్టాలని కోరారు. దానికి భవిక ఘాటుగా స్పందించారు.
‘‘ఈ ఉదయం సర్వప్రతినిధి సభ దురదృష్టవశాత్తు గొప్ప అధిక్షేప సన్నివేశాన్ని చూడాల్సి వచ్చింది. సైన్యం నడిపే దేశం, ప్రపంచమంతటా ఉగ్రవాదానికి, డ్రగ్స్ వ్యాపారానికీ, కరుడుగట్టిన నేరాలకూ పేరు గడించిన దేశం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంపై దాడికి పాల్పడే దుస్సాహసం చేసింది. పాకిస్తాన్ అసలు ముఖమేమిటో ఈ ప్రపంచం చూడగలదు’’ అని భవిక అన్నారు. 2001లో భారత పార్లమెంటు మీద, 2008లో ముంబైలోనూ పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దాడులను ఆమె ప్రస్తావించారు.
‘‘పాకిస్తాన్ ప్రధానమంత్రి అలా మాట్లాడడం ఆశ్చర్యకరం ఏమీ కాదు. ఐతే ఆయన మాటలు ఎవరికీ ఆమోదయోగ్యం కావన్న సంగతిని స్పష్టం చేసి తీరాలి. సత్యాన్ని ఎప్పుడూ మరిన్ని అబద్ధాలతోనే ఎదుర్కోవాలనే పాకిస్తాన్ ప్రయత్నిస్తుందని మనకు తెలుసు. పదేపదే చెప్పినంత మాత్రాన నిజాలు మారిపోవు. మా వైఖరి సుస్పష్టం, దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పనక్కరలేదు’’ అని భవిక తేల్చిచెప్పారు.
ఉగ్రవాదాన్ని నిర్మూలించేంత వరకూ పాకిస్తాన్‌తో వ్యూహాత్మక సంయమనం గురించి చర్చించడం అనవసరమని భారత్ పునరుద్ఘాటించింది. ‘‘ఉగ్రవాదంతో ఎలాంటి ఒప్పందమూ ఉండలేదు’’ అని భవిక స్పష్టం చేసారు. పాకిస్తాన్ గతం గురించి భవిక వివరంగా చెప్పుకొచ్చారు. ఒసామా బిన్ లాడెన్‌కు ఆతిథ్యం ఇవ్వడం నుంచి ప్రపంచవ్యాప్తంగా వివిధ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడడం వరకూ చెప్పుకొచ్చారు.
షెబాజ్ షరీఫ్ తన ప్రసంగంలో కశ్మీర్ అంశాన్ని ప్రాదేశిక శాంతితో కలిపి ప్రస్తావించారు. భారతదేశం పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా తన సైనిక శక్తిని పెంచుకుంటోదని ఆరోపించారు. షెబాజ్ వ్యాఖ్యలను భవిక తిప్పికొట్టారు. ఉగ్రవాదం ద్వారా జమ్మూకశ్మీర్‌లో జోక్యం చేసుకునే పాకిస్తాన్ దుశ్చరిత్ర గురించి చెప్పుకొచ్చారు. ఆ ప్రాంతంలో ప్రజాస్వామిక ప్రక్రియకు పాకిస్తాన్ మోకాలడ్డుతోందని మండిపడ్డారు.
భవిక పాకిస్తాన్ ఉగ్రవాదం గురించి చెప్పి ఆగిపోలేదు, ఆ దేశపు అంతర్గత వ్యవహారాలను సైతం ప్రస్తావించారు. పాకిస్తాన్లో మానవ హక్కులు ఉల్లంఘనల గురించి మాట్లాడారు. 1971లో బంగ్లాదేశ్‌లో సామూహిక జనహననం, మైనారిటీల ఊచకోత వంటి దారుణాలకు పాల్పడిన పాకిస్తాన్ ఇప్పుడు ప్రపంచానికి అసహనం గురించి లెక్చర్లు దంచుతుండడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు.
భారత్ వాదనను పాకిస్తాన్ ఖండించింది. ప్రత్యుత్తరమిచ్చే హక్కు ద్వారా పాకిస్తాన్ తన స్పందనలో భారత్ తమ దేశం గురించి నిరాధారమైన, తప్పుదోవ పట్టించే ఆరోపణలు చేస్తోందని చెప్పింది. జమ్మూకశ్మీర్‌లో రిఫరెండం నిర్వహించాలని మరోసారి కోరింది.