తిరుమల లడ్డూ తయారీకి వాడే నెయ్యి మీద కల్తీ ఆరోపణల వ్యవహారంలో మాజీ సీఎం వైఎస్ జగన్ అడ్డంగా ఇరుక్కుపోయారు. అందులోనుంచి బైటపడలేక అవస్థలు పడుతున్నారు. అదే క్రమంలో డిక్లరేషన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పడు లౌకికవాదం కబుర్లు చెబుతున్నారు. దేవాలయంలో లౌకికవాదం గురించి అడుగుతున్న జగన్, ఇతర మతాల విషయంలో అదే పని చేయగలరా?
లడ్డూ వివాదంలో చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీసారని, తిరుమల వేంకటేశ్వరుడి పట్ల కూటమి నేతలు దారుణమైన పాపాలు చేసారనీ, వాటి ప్రక్షాళన కోసం ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా పూజలు చేయాలనీ వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ఆ క్రమంలో ఆయన ఇవాళ తిరుమల వేంకటేశ్వరుడిని దర్శనం చేసుకుంటానని ప్రకటించారు.
అధికార పక్షం చేతికి వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంది. క్రైస్తవుడైన జగన్, తిరుమల ఆచారాల ప్రకారం డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే దర్శనం చేసుకోవాలని పట్టుపట్టింది. తితిదే అధికారులు ఆ మేరకు తిరుపతిలో ఫ్లెక్సీలు కూడా పెట్టారు. జగన్ను దర్శనానికి వెళ్ళకుండా నేరుగా అడ్డుకోలేదు, కానీ తిరుమల సంప్రదాయం ప్రకారం అన్యమతస్తులు ఇవ్వవలసిన డిక్లరేషన్ గురించి ప్రస్తావించడం ద్వారా జగన్ మీద ఒత్తిడి పెంచింది. దాంతో జగన్ తన తిరుమల ప్రయాణాన్ని వాయిదా వేసుకోవలసి వచ్చింది.
తనను తిరుమల వెళ్ళకుండా అడ్డుకోడానికి అధికార కూటమి కుతంత్రాలు పన్నిందని జగన్ ఆరోపించారు. వైసీపీ నాయకులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేసారని చెప్పారు. బీజేపీ పొరుగు రాష్ట్రాల నుంచి తమ శ్రేణులను తిరుమలకు తరలించిందని ఆరోపించారు. ప్రభుత్వం వేల సంఖ్యలో పోలీసులను మోహరించిందని తద్వారా శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు కుట్ర పన్నిందనీ మండిపడ్డారు. తను వేంకటేశ్వరుడిని ప్రేమించి గౌరవిస్తానని, ఇప్పుడు తిరుమల వెడితే చంద్రబాబు ఆశించినట్లు విషయం పక్కదోవ పడుతుందనీ అందువల్ల తన తిరుమల ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటున్నాననీ జగన్ చెప్పారు.
తన కులమతాలు అందరికీ తెలిసినవే అనీ, తాను గతంలో చాలాసార్లు తిరుమల దర్శనానికి వెళ్ళాననీ, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు సమర్పించాననీ జగన్ గుర్తుచేసారు. మొదటిసారి ఎవరైనా వెడుతుంటే డిక్లరేషన్ అడగవచ్చు కానీ 10-11సార్లు దర్శనం చేసుకున్నాక ఇవాళ అడ్డుకోవడం ఏమిటని నిలదీసారు. ఈరోజు తన మతం కారణంగా తనను ఆలయానికి వెళ్ళనీయడం లేదని ఆరోపించారు. తన మతం మానవత్వం అనీ, అదే విషయాన్ని డిక్లరేషన్లో రాసుకొమ్మనీ చెప్పుకొచ్చారు.
ఆ సందర్భంగా జగన్ లౌకికవాదం గురించి ప్రస్తావించారు. భారత రాజ్యాంగం ప్రకారం మన దేశం లౌకికదేశమని గుర్తు చేసారు. మాజీ ముఖ్యమంత్రినే గుడిలోకి రానీయకపోతే సామాన్య దళితులను గుడిలోకి పోనిస్తారా అంటూ ప్రశ్నించారు.
అయితే, భారత్ లౌకికవాద దేశమని రాజ్యాంగంలో పెట్టింది భారత రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్ అంబేద్కర్ కాదు. ఇందిరాగాంధీ హయాంలో రాజ్యాంగాన్ని సవరించి సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలను కలిపారు. కనీసం పార్లమెంటులో చర్చించనైనా చర్చించకుండా దేశం మీద లౌకికవాదాన్ని రుద్దింది ఇందిరాగాంధీ. అదొక రాజకీయ స్వార్థపూరిత ప్రయోగం తప్ప దేశప్రజల ప్రయోజనం కోసం పెట్టింది కాదు. ఆ సోకాల్డ్ లౌకికవాదం దేశానికి అవసరమై ఉంటే అంబేద్కరే రాజ్యాంగంలో పెట్టిఉండేవారు కదా.
అయినా, లౌకికవాదం అంటే ఒక మతం వారి ప్రార్థనా స్థలాల్లో అన్యమతాల పూజలు చేయమని కాదు కదా. ఏ మతం వారు తమ ప్రార్థనాస్థలాల్లో తమ పూజలు చేసుకోవాలని మాత్రమే. ఆలయం లేదా చర్చి లేదా మసీదు లేదా గురుద్వారా లోపల లౌకికవాదం ఉండదు. ఒక ప్రార్థనాస్థలానికి వెళ్ళినప్పుడు అక్కడి పద్ధతులు పాటించి తీరాలి. మనకు నచ్చినా నచ్చకపోయినా సరే. మన డబ్బులు ఖర్చుపెట్టుకుని సినిమా చూడడానికి వెళ్ళే సినిమా హాలులోనే అక్కడి నియమ నిబంధనలు పాటిస్తామే, అలాంటిది దేవాలయంలో ఉండే నియమ నిబంధనలు పాటించడానికి సమస్య ఏమిటి?
డిక్లరేషన్లో తన మతం మానవత్వం అని రాసుకోవాలంటూ జగన్ ప్రకటించారు. అసలు డిక్లరేషన్ ఇవ్వాల్సింది అక్కడికి వెళ్ళదలచుకున్న వ్యక్తి. అంటే ఈ సందర్భంలో జగన్ ఇవ్వాలి. అది ఇవ్వడానికి ఇష్టపడడం లేని జగన్, ఇలాంటి ఎత్తిపొడుపు మాటలు మాట్లాడడం అనవసరం. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఈ దేశంలో కులం, మతం అనేవి ఇంకా అమల్లోనే ఉన్నాయి. ప్రభుత్వ రికార్డుల్లోనే ప్రతీ వ్యక్తి కులం, మతం నమోదు చేస్తున్నారు. నా మతం మానవత్వం అంటూ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేస్తే అది తన అభిమానులను ఆనందింపజేస్తుందేమో కానీ రికార్డులకు సరిపోదు. పాఠశాలలో చేరినప్పటి నుంచీ ప్రతీ వ్యక్తి కులమూ మతమూ నమోదు చేస్తూనే ఉన్నారు కదా. ఎన్నికల అఫిడవిట్లో నా మతం మానవత్వం అని రాస్తే ఊరుకుంటారా?
తిరుమలలో డిక్లరేషన్ అవసరమా కాదా అన్నది వేరే ప్రశ్న. అక్కడ డిక్లరేషన్ అంటూ ఒక పద్ధతి ఉన్నప్పుడు దాన్ని తప్పకుండా పాటించాల్సిందే. పోనీ, జగన్ చెప్పుకున్నట్టు స్వామి మీద గౌరవంతో పదుల సార్లు అక్కడికి వెళ్ళిన అన్యమతస్తులకు డిక్లరేషన్ అవసరం లేదంటే, ఆ మేరకు ఏర్పాట్లు చేసి ఉండాల్సింది. జగన్ అయిదేళ్ళ పాటు అధికారంలో ఉన్నారు కదా. అప్పుడే ఆ నిబంధనలను సడలించి ఉండవచ్చు కదా. స్వతంత్రానికి పూర్వం నుంచీ ఉన్న ఆ నిబంధనను పలువురు బ్రిటిష్ అధికారులు, స్వతంత్రానంతరం సోనియా గాంధీ, అబ్దుల్ కలాం వంటి వారూ పాటించినప్పుడు తాను పాటించడానికి ఏమైంది? తాను ఎన్నోసార్లు తిరుమల వెళ్ళాను కదా డిక్లరేషన్ అక్కర్లేదు అంటున్న జగన్, అసలు గతంలో తాను వెళ్ళినప్పుడు ఒక్కసారైనా డిక్లరేషన్ ఇచ్చారా? లేదే.
అసలు, డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్కు సమస్య ఏమిటి? తన కులమతాలు అందరికీ తెలిసినవే అని చెబుతున్న జగన్, అదే విషయాన్ని రాతపూర్వకంగా చెప్తే వచ్చే నష్టమేమిటి? అన్యమతస్తుడిని అయినప్పటికీ తనకు స్వామి మీద గౌరవం, శ్రద్ధాభక్తులు ఉన్నాయంటున్న జగన్, అదే విషయాన్ని లిఖితపూర్వకంగా ఒప్పుకుంటే తప్పేమిటి? ఇప్పుడు తను గుడిలోకి రావడం నిషేధం అని ఎవరూ ఆంక్షలు పెట్టలేదు. డిక్లరేషన్ ఇచ్చి అధికారికంగానే దర్శనం చేసుకుని రావడంలో కష్టమేముంది.
ఇంక దళితులను గుడిలోకి రానిస్తారా అంటూ వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం అనవసరం. ఇప్పటికే క్రైస్తవ మతంలోకి మారి, అయినా కూడా హిందువులుగా చెలామణీ అవుతూ, తిరుపతి వెంకన్నకు భక్తులు ఇస్తున్న సొమ్మును సిగ్గు లేకుండా దోచుకుతింటున్న వారెందరో ఉన్నారు. అటువంటి వారిని గుర్తించాలి అన్నందుకే కదా జగన్ హయాంలో ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం మీద వేటువేసింది. అయినా, రోజూ లక్షల సంఖ్యలో తిరుమల వెంకన్నను దర్శించుకుంటున్నవారిలో అత్యధికులు దళితులు కాదా? దళితులందరూ హిందువులే. అందుకే కదా అన్యమతంలోకి మారినవారు దళిత రిజర్వేషన్లు పోగొట్టుకోవడం ఇష్టం లేక హిందువులమంటూ అబద్ధపు బతుకులు బతుకుతున్నారు. హిందువులైన దళితుల మీద తిరుపతి దేవాలయంలోకి వెళ్ళడానికి ఎలాంటి ఆంక్షలూ లేవు. అయినా వారిని ప్రస్తావించడం ద్వారా జగన్ ఆ వర్గాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం సబబు కాదు.
తిరుమల విషయంలో మన రాష్ట్రంలో రాజకీయం చేయని పార్టీయే లేదు. చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ లేదా పురందరేశ్వరి… ఎవరికైనా ప్రధానంగా కావలసినవి వారి రాజకీయ ప్రయోజనాలే. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఆరోపణలతో చంద్రబాబు, రాజకీయ శత్రువు జగన్ను చావుదెబ్బ కొట్టారు. చంద్రబాబు పాపాలను ప్రక్షాళన చేస్తానంటూ తిరుమలలో పూజలు చేయడానికి జగన్ బయల్దేరారు. దాన్ని అడ్డుకోడానికి చంద్రబాబు డిక్లరేషన్ అస్త్రాన్ని ప్రయోగించారు. రాజకీయపు ఎత్తుగడగానే అయినా, చంద్రబాబును ఓడించాలనుకుంటే జగన్ ఆ డిక్లరేషన్ ఇచ్చి ఉంటే సరిపోయేది కదా. అసలు, తిరుమలలో అమల్లో ఉన్న డిక్లరేషన్ నిబంధనను పాటించకూడదని జగన్కు అంత పంతం దేనికి? చివరికి తిరుమల పర్యటన వాయిదా వేసుకోవడం ద్వారా ఈ విషయంలో జగన్ సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లే అయింది.