తిరుమల మాటున రాజకీయాలు మానుకోవాలని చంద్రబాబుపై మండిపాటు
ఆంధ్రప్రదేశ్ లో రాక్షసరాజ్యం పాలన చేస్తోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తిరుమల పర్యటన రద్దు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వెళుతుంటే ప్రభుత్వం అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయ స్వార్థం కోసం తిరుమల వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం విశిష్టత దెబ్బతీయడం ధర్మమేనా అని ప్రశ్నించారు. తిరుమలకు రావద్దని వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇవ్వడం దేనికి సంకేతమన్నారు. దేవుడి దర్శనానికి వెళుతుంటే అడ్డుకోవడం తన రాజకీయ జీవితంలో ఇదే మొదటిసారి అని ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీ నేతలు ఇతర రాష్ట్రాల నుంచి కార్యకర్తలను తిరుపతికి రప్పించారని ఆరోపించిన జగన్ వైఎస్ జగన్, ఆ పార్టీ అగ్ర నాయకత్వానికి ఈ విషయం తెలుసా అని ప్రశ్నించారు.
కల్తీ నెయ్యిని ప్రసాదం తయారీలో వాడలేదని ఈవో చెబుతుంటే సీఎం చంద్రబాబు మాత్రం అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని అన్నారు. అబద్ధాలతో తిరుమల పవిత్రను ఎందుకు దెబ్బతీస్తున్నారని ప్రశ్నించారు.
లడ్డూ ప్రసాదం వ్యవహారంలో చంద్రబాబు చేసిన తప్పులను డైవర్ట్ చేసేందుకు డిక్లరేషన్ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు బయటకు తెచ్చారని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్రహ్మోత్సవాల్లో పట్టువస్త్రాలు సమర్పించారని గుర్తు చేశారు. తాను కూడా ముఖ్యమంత్రి కాకముందు తిరుమలకు వెళ్ళాను అని చెప్పారు. ప్రతిపక్ష నేతగా తాను తిరుమలకు వెళ్ళినప్పుడు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం, ఎందుకు డిక్లరేషన్ గురించి మాట్లాడలేదని దుయ్యబట్టారు. తాను సీఎంగా ఉన్నప్పుడు కూడా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించానని చెప్పారు. లడ్డూ ప్రసాదం వివాదం తర్వాత డిక్లరేషన్ అడగడం దేనికి సంకేతం అన్నారు.
నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతానన్న జగన్ మోహన్ రెడ్డి, బయటకు వెళితే హిందూ సంప్రదాయాలను అనుసరిస్తాను, గౌరవిస్తాను అని తెలిపారు. అం దులో తప్పేముందన్నారు. ఇస్లాం, సిక్కుమతాలను కూడా అనుసరిస్తాను గౌరవిస్తాను అని చెప్పారు. డిక్లరేషన్ లో రాసుకుంటే రాసుకోండన్నారు.
భారత రాజ్యాంగం మేరకు సెక్యూలర్ దేశంలో ముఖ్యమంత్రి పరిస్థితి ఇలా ఉంటే దళితుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దేవాలయాల్లోనికి వారిని రానిస్తారా అని అన్నారు. మతం పేరుతో రాజకీయాలు చేయడం ఎంత దౌర్బాగ్యం అన్నారు.