బిహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లా బగహా పట్టణంలో క్రైస్తవ మిషనరీలు ఏర్పాటు చేసిన ఒక సమావేశాన్ని స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. ఆ సమావేశంలో వారు వైద్య సహాయం అందిస్తామంటూ ప్రజలను మతం మార్చడానికి ప్రేరేపిస్తున్నారు.
కొందరు క్రైస్తవ మిషనరీలు బగహా పట్టణంలోని చౌరసియా గల్లీలో వైద్యశిబిరం పేరిట ఒక తాత్కాలిక శిబిరం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ వారు వైద్యసహాయం పేరిట మతం మార్చే పనులు చేస్తున్నారు. ఆ విషయం తెలిసిన కొందరు గ్రామస్తులు, సమాజ సేవకులు కలిసి అక్కడకు వెళ్ళారు. మతం మార్చే పని చేయవద్దంటూ నిరసన తెలియజేసారు. దాంతో ఇరువర్గాల మధ్యా ఘర్షణ వాతావరణం నెలకొంది.
బగహా పట్టణానికి సమీపంలోని రతన్‌పూర్వ ప్రాంతం నుంచి కొన్నాళ్ళుగా కొందరు క్రైస్తవ మిషనరీలు తమ ప్రాంతానికి వస్తున్నారని స్థానికులు తెలిపారు. కొన్ని రోజుల క్రితం మిషనరీలు బగహాలోనే వైద్యశిబిరం ఏర్పాటు చేసారు. అక్కడకు అమాయకులైన ప్రజలను వైద్య సహాయం పేరిట ఆకర్షించి, అక్కడ మతం మారుస్తున్నారని స్థానికులు మండిపడ్డారు.
ఉద్రిక్త పరిస్థితుల గురించిన సమాచారం అందిన వెంటనే పోలీసు బృందం అక్కడకు చేరుకుంది. కోపంతో ఉన్న స్థానికులను బుజ్జగించి చల్లార్చే ప్రయత్నం చేసింది. పోలీసు జోక్యంతో మిషనరీలు అక్కడినుంచి పారిపోయారు. దాంతో పరిస్థితి సద్దుమణిగింది.
బిహార్‌లోని చిన్నచిన్న పట్టణాలు, పల్లెటూళ్ళలో గత కొన్నేళ్ళుగా మతమార్పిడి కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ నెలలోనే 11వ తేదీన ముజఫర్‌పూర్ జిల్లాలో హథోడీ ప్రాంతంలో స్థానిక మహిళలను మభ్యపెట్టి, వారి సంప్రదాయిక ప్రార్థనా పద్ధతుల నుంచి వారిని మరల్చి క్రైస్తవంలోకి మార్చే ప్రయత్నం జరిగింది. అయితే అప్రమత్తంగా ఉన్న కొందరు గ్రామస్తులు అడ్డుకోవడంతో ఆ పని నిలిచిపోయింది.