ఆంధ్రప్రదేశ్లో ఏనుగుల బీభత్సవాన్ని అరికట్టేందుకు 8 కుంకి ఏనుగులు పంపేందుకు కర్ణాటక ప్రభుత్వం అంగీకరించింది. ఈ విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాల మధ్య జరిగిన ఎంవోయూ గురించి వివరించారు.
ఇటీవల కర్ణాటక వెళ్ళిన పవన్ కళ్యాణ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్రమంత్రి, అటవీశాఖ అధికారులతో కుంకీ ఏనుగుల గురించి చర్చించామని పవన్ తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల ఎలిఫెంట్ కారిడార్ ఏర్పాటుకు నిర్ణయించామని, మావటి, కావటిలకు శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసి వారిలో సామర్ధ్యాన్ని పెంచనున్నామని వివరించారు.
ఏపీలో ఏనుగుల సంరక్షణ, వాటి ఆహారం సహా పలు అంశాలపై ఇరు రాష్ట్రాల మధ్యం ఒప్పందం చేసుకున్నామన్నారు. ఏపీలోని శ్రీకాకుళం, మన్యం, చిత్తూరు జిల్లాలో ఏనుగులు దాడులకు పాల్పడుతున్నాయి. ప్రాణనష్టం, పంట నష్టం జరుగుతుందని వెల్లడించారు. కుంకీ ఏనుగుల వల్ల ఏనుగుల దాడులను అరికట్టే అవకాశం ఉంది. దీంతో కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను తీసుకువస్తున్నారు. ఈ విషయమై ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగింది. అలాగే ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టేందుకు ఏపీ, కర్ణాటక సంయుక్తంగా అంగీకరించాయి.
గజరాజులు అటవీప్రాంతంలోని నివాసాలు, పంటపొలాలపై దండెత్తినప్పుడు అదుపు చేయడం సాధ్యమయ్యే పనికాదు. వీటిని అదుపు చేయడానికే తర్ఫీదు ఇచ్చిన కుంకీ ఏనుగులను రంగంలోకి దింపుతారు.
గాయపడిన లేదా చిక్కుకున్న అడవి ఏనుగును రక్షించడానికీ సాయం చేస్తాయి. మగ ఏనుగులను కుంకీలుగా ఎంపిక చేస్తారు. ఇవి మాత్రమే ఒంటరిగా సంచరిస్తుంటాయి. వీటిని బంధించి కొన్ని నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
చిత్తూరు జిల్లాలో జయంత్, వినాయక్ అనే కుంకీలు ఉన్నాయి. కౌండిన్య అడవుల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న ననియాల సంరక్షణ కేంద్రంలో ఇవి ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఏనుగులు దాడికి దిగితే వీటిని రంగంలోకి దింపి పరిస్థితిని అదుపులోకి తెస్తారు. అయితే ప్రస్తుతం జయంత్ వయసు 55, వినాయక్ వయసు 59 ఏళ్లు కావడంతో వృద్ధప్య సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కుంకీ ఏనుగుల తరలింపు కోసం ఒప్పందం చేసుకుంది.