తిరుమల డిక్లరేషన్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందని తేలింది. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర రాజకీయ దుమారం రేపింది. వైసీపీ వెర్సెస్ ఎన్డీయే కూటమి మధ్య పరస్పర విమర్శల యుద్ధం భీకరంగా జరగుతోంది.
శ్రీవారి ప్రసాదం తయారీలో ఉపయోగించే ఆవునెయ్యి లో కల్తీ జరిగిందని అందులో అభ్యంతరకర పదార్థాలు ఉన్నాయని టీటీడీ విచారణలో తేలింది. తమకు అందిన ల్యాబ్ రిపోర్టులోని విషయాలను టీటీడీ ఈవో మీడియాకు వివరించారు.
అయితే వైసీపీ హయాంలోనే తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యత తగ్గిందని టీడీపీ ఆరోపించింది. అన్ని వ్యవస్థలను నాశనం చేసినట్లే తిరుమల పవిత్రతను కూడా వైసీపీ దెబ్బతీసిందని ఏపీ ఎన్డీయే ప్రభుత్వం ఆరోపించింది.
తిరుమలలో జరిగిన అపచారం ప్రక్షాళనకు గాను జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. దీక్షలో భాగంగా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయ మెట్లు కడిగారు. లౌకికవాదం పేరిట హిందువుల ఆచారాలను అవహేళన చేయడం సరికాదని హితవు పలికారు. తెలిసితెలియకుండా సనాతన ధర్మం గురించి వ్యాఖ్యలు చేసి చులకన కావద్దని హెచ్చరించారు.
బీజేపీ కూడా ఈ విషయంలో జగన్ ను తీవ్రంగా తూర్పారబట్టింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ తిరుమలకు వెళ్ళాలంటే డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది.
అన్యమతస్థులు తిరుమలకు వచ్చినప్పుడు శ్రీవారి దర్శనానికి వెళ్ళాలంటే కచ్చితంగా అఫిడవిట్ సమర్పించాలని టీటీడీ చెబుతోంది. దేవాదాయశాఖ చట్టం 30/1987ని అనుసరించి 1990లో అప్పటి ప్రభుత్వం ఈ జీవోను జారీ చేసింది. ఈ నిబంధన మేరకు హిందూ యేతరులు లేదా అన్యమతస్థులు.. తిరుమల శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించాలంటే ముందుగా డిక్లరేషన్ ఫారంపై సంతకం చేయాల్సి ఉంది. తాను వేరే మతానికి సంబంధించిన వ్యక్తిని అయినప్పటికీ శ్రీవేంకటేశ్వరస్వామిపై నమ్మకం, గౌరవం ఉన్నందున తనను దర్శనానికి అనుమతించాలని కోరుతూ వివరాలు నమోదు చేసి సంతకం చేయాలి.
గతంలో సోనియా గాంధీ, ఏపీజే అబ్దుల్ కలాంతో పాటూ పలువురు ప్రముఖులు సైతం డిక్లరేషన్ సమర్పించిన విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు.
తిరుమల వచ్చే అన్యమతస్థుల్లో సామాన్య భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు 17వ కంపార్ట్‌మెంటు దగ్గర డిక్లరేషన్‌పై సంతకం చేయాలి. వీఐపీలు వచ్చినప్పుడు అధికారులే గెస్ట్‌హౌస్ దగ్గరకు వెళ్లి సంతకాలు చేయించుకుంటారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ , తిరుమల వస్తే గెస్ట్‌హౌస్ దగ్గరకు వెళ్లి టీటీడీ నిబంధనలు, దేవాదాయశాఖ చట్టంలోని అంశాలను ఆయనకు వివరించి డిక్లరేషన్‌పై సంతకం చేయాలని అడగనున్నట్లు సమాచారం.
వైసీపీ ఐదేళ్ల పాలనలో జగన్ పలు సందర్భాల్లో శ్రీవారి దర్శనానికి వచ్చారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండటంతో.. టీటీడీ ఆయను డిక్లరేషన్ కోరలేదు.
ప్రస్తుతం కూడా తమ నేత జగన్ మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వరని ఆ పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి చెబుతున్నారు.
తిరుమల శ్రీవారిని టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయాల్లోకి లాగడం ఏంటని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు చేసిన పాపాల ప్రక్షాళన కోసం ప్రార్థించేందుకే తమ అధినేత ఏడుకొండలకు వస్తున్నారని చెప్పారు.
అయితే ఈ వివాదంపై స్పందించిన ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, తిరుమల డిక్లరేషన్ రూల్ అందరికీ వర్తిస్తుందని తెలిపారు.