బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని యూనస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని పీఠం నుంచి షేక్ హసీనాను దింపడం ప్రణాళిక ప్రకారం జరిగిన కుట్ర అని అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా క్లింటన్ గ్లోబల్ ఇనిషియేటివ్ వార్షిక సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
విద్యార్థి నాయకులు బంగ్లాదేశ్‌కు కొత్త రూపు తీసుకువచ్చారని కొనియాడిన యూనస్, హసీనాను పదవి నుంచి దింపే కుట్రవెనక ఎవరున్నారో బయటకు రాలేదు అన్నారు. కానీ, మహఫుజ్ అబ్దుల్లా పాత్ర ఉండొచ్చంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇదంతా యాదృచ్ఛికంగా జరిగింది కాదని, ఒక ప్రణాళిక ప్రకారం జరిగిందన్నారు.
హసీనాను దించే కుట్రలో విదేశీ హస్తం ఉందని, అమెరికా పేరు ఉందని వార్తలు వెలువడ్డాయి. పదవి నుంచి దిగిపోవడానికి ముందు మేలో హసీనా చేసిన ప్రకటన కూడా అందుకు కారణమైందనే విశ్లేషణలు ఉన్నాయి.
బంగ్లాదేశ్ భూభాగంలోని సెయింట్ మార్టిన్ దీవిలో వైమానిక స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి ఒక దేశానికి అనుమతిస్తే.. తన ఎన్నిక సాఫీగా జరిగేటట్లు చేస్తానని ఆఫరు వచ్చింది అని ప్రకటించారు. ఆ వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం రేపాయి. అమెరికానే ఆ దేశం అయి ఉంటుందనే ప్రచారం జరిగింది. జనవరిలో జరిగిన బంగ్లాదేశ్ ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగలేదని అమెరికా విదేశాంగశాఖ వ్యాఖ్యానించింది.