శివసేన(యుబిటి) నాయకుడు సంజయ్‌రౌత్ ఒక పరువునష్టం కేసులో దోషిగా కోర్టు నిర్ధారించింది. ముంబైలోని మజగావ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు అతనికి 15రోజుల సాధారణ జైలుశిక్ష, రూ.25వేల జరిమామేనా విధించింది.
బిజెపి నాయకుడు కిరీట్ సోమయ్య భార్య మేధ చేసిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసును విచారించిన న్యాయస్థానం అతన్ని నేరస్తుడిగా నిర్ధారించింది. ఐపీసీ సెక్షన్ 500 కింద దోషిగా ప్రకటించి శిక్ష విధించినట్లు మేధ తరఫు న్యాయవాది చెప్పారు. జరిమానా మొత్తాన్ని బాధితురాలికి చెల్లించాల్సి ఉంటుంది. సంజయ్‌రౌత్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నట్లు కిరీట్ సోమయ్య వెల్లడించారు.
మేధ, కిరీట్ సోమయ్య దంపతులు మీరా-భయండర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణంలో రూ.100 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని సంజయ్ రౌత్ 2022 మే నెలలో ఆరోపించారు. ఆ ఆరోపణల మీద మండిపడిన మేధ రూ.100 కోట్లకు రౌత్ మీద పరువునష్టం దావా వేసారు. సంజయ్ రౌత్ దురుద్దేశంతో తమ దంపతుల మీద అసంబద్ధమూ అసత్యమూ అయిన ఆరోపణలు చేసారంటూ ఆమె ఫిర్యాదు చేసారు. సామ్నా పత్రిక సంపాదకుడి హోదాలో ఆ పత్రిక ద్వారా చేసిన దుష్ప్రచారం వల్ల తమ పరువుకు భంగం కలిగిందని ఆమె ఆరోపించారు. ఆ కేసులో ముంబై కోర్టు ఇవాళ తీర్పునిచ్చింది.