తప్పుడు ఆరోపణలు చేసి తన పరువుకు నష్టం కలిగించారని పిటిషన్
నిరాధార ఆరోపణలని తేల్చిన న్యాయస్థానం
శివసేన (యూబీటీ) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ కు ముంబై మెట్రోపాలిటన్ కోర్టు జైలు శిక్ష విధించింది. పరువునష్టం దావా కేసులో పదిహేను రోజుల జైలు శిక్షతో పాటు రూ.25 వేల జరిమానా కూడా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
బీజేపీ నేత కిరీట్ సోమయ్య, ఆయన భార్య డాక్టర్ మేధా కిరీట్ సోమయ్యలపై సంజయ్ రౌత్ అవినీతి ఆరోపణలు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం, నిర్వహణలో భారీ స్కాం జరిగిందని సంజయ్ రౌత్ గతంలో ఆరోపణలు చేశారు. కిరీట్ సోమయ్య దంపతులు రూ.100 కోట్ల స్కాం చేశారని విమర్శించారు.
ఈ ఆరోపణలను ఖండించిన డాక్టర్ మేధా కిరీట్ సోమయ్య.. సంజయ్ రౌత్ పై పరువునష్టం దావా వేశారు. ఈ దావాను విచారించిన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్.. సంజయ్ రౌత్ నిరాధార ఆరోపణలు చేశారని నిర్ధారించింది. తప్పుడు ఆరోపణలు చేసి కిరీట్ సోమయ్య దంపతులకు పరువునష్టం కలిగించారని తేల్చింది. దీంతో ఎంపీకి 15 రోజుల జైలు శిక్ష, రూ.25 వేల జరిమానా విధించినట్లు ఉత్తర్వులు జారీ చేసింది.