జి-4 దేశాలైన భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్లకు ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలని ఆ దేశాలు పిలుపునిచ్చాయి. ఐక్యరాజ్యసమితి ప్రస్తుత ప్రపంచ రాజకీయ భౌగోళిక వాస్తవ పరిస్థితులకు దర్పణంలా ఉండడానికి, వర్తమానంలోనూ భవిష్యత్తులోనూ తన విలువ నిలబెట్టుకోడానికీ చేయాల్సిన ప్రయత్నాల్లో అత్యంత ఆవశ్యకమైనది భద్రతామండలిని సమగ్రంగా సంస్కరించడమే అని స్పష్టం చేసాయి. ఆ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో భద్రతా మండలి సంస్కరణ మాత్రమే ఐరాస భవిష్యత్తును కాపాడగలదని కుండబద్దలుకొట్టి చెప్పాయి.
భారత్ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, బ్రెజిల్ మంత్రి మావురో వియేరా, జర్మనీ మంత్రి ఆనలేనా బార్బోక్, జపాన్ మంత్రి యోకో కమికావా ఈ నలుగురూ సెప్టెంబర్ 23న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశం సమయంలో కలిసారు. వర్తమాన ప్రపంచంలోని బహుళధ్రువ విధానం, భద్రతామండలిలో చేయవలసిన సంస్కరణల గురించి చర్చించారు.
ఆ సమావేశం గురించి వివరిస్తూ భారత విదేశాంగశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ఐక్యరాజ్యసమితిలోని బహుళధ్రువ విధానం ఎదుర్కొంటున్న సవాళ్ళను జి-4 మంత్రులు పరిశీలించారు. భద్రతామండలిని సమూలంగా సంస్కరించాల్సిన అవసరాన్ని వారు నొక్కిచెప్పారు. సెప్టెంబర్ 22, 23 తేదీల్లో జరిగిన ‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’లో భద్రతామండలిని తక్షణం సంస్కరించాలంటూ ప్రపంచదేశాల నాయకులు చెప్పడాన్ని స్వాగతించారు’’ అని ఆ ప్రకటన వెల్లడించింది.
జి-20కి బ్రెజిల్ అధ్యక్షత వహించాల్సి ఉన్న సందర్భంలో ఆ దేశం అంతర్జాతీయ పాలనా సంస్కరణల విషయంలో కార్యాచరణ చేపట్టాలంటూ బ్రెజిల్ ప్రకటించడాన్ని జర్మనీ, జపాన్, భారత్ స్వాగతించాయి. ‘‘భద్రతామండలిలో శాశ్వత, తాత్కాలిక సభ్య దేశాల సంఖ్యను విస్తరించాలన్న అభిప్రాయాన్ని జి-4 మంత్రులు పునరుద్ఘాటించారు. ఆ దిశగా చర్చలు ప్రారంభించాలన్న ప్రతిపాదనకు ఐరాసలోని సభ్యదేశాలు కూడా పెద్దసంఖ్యలో మద్దతిచ్చాయి. తద్వారా భద్రతా మండలి చట్టబద్ధత, ప్రభావశీలత గణనీయంగా పెరుగుతాయని అభిప్రాయపడ్డాయి’’ అని భారత విదేశాంగ శాఖ ప్రకటన వెల్లడించింది.
భద్రతామండలిలో అభివృద్ధి చెందుతున్న దేశాల భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉందని, ఆ విధంగానే ప్రపంచ శాంతి, భద్రత మెరుగుపడతాయనీ జి-4 దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఆఫ్రికా, ఆసియా పసిఫిక్, లాటిన్ అమెరికా, కరేబియన్ వంటి ప్రాంతాల దేశాలకు ఐక్యరాజ్యసమితిలోనూ, భద్రతా మండలిలోనూ ప్రాతినిధ్యం లేదు, లేదా తక్కువగా ఉంది. ఆ పరిస్థితిని మార్చడం ముఖ్యమని జి-4 దేశాలు నొక్కి వక్కాణించాయి. ఆ దిశగా ‘ఇంటర్-గవర్నమెంటల్ నెగోషియేషన్స్’ (వివిధ ప్రభుత్వాల మధ్య చర్చలు) చేస్తున్న ప్రయత్నాలను అభినందించాయి.
‘‘ప్రభుత్వాల మధ్య చర్చల్లో పురోగతి పెద్దగా లేకపోవడంపై జి-4 దేశాల మంత్రులు ఆందోళన వ్యక్తం చేసారు. లిఖితపూర్వక చర్చలు ప్రారంభించడం అత్యవసరమని అభిప్రాయపడ్డారు’’ అని విదేశాంగశాఖ వెల్లడించింది.
2025లో ఐక్యరాజ్యసమితి 80వ వార్షికోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని భద్రతామండలి సంస్కరణలను వేగవంతం చేయాలని జి-4 మంత్రులు సూచించారు. జి-4 సభ్యదేశాలకు భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలన్న ప్రతిపాదనకు పరస్పరం మద్దతు పలికారు.