అమెరికాలో మరో మారు హిందూ ఆలయంపై దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఓ ఆలయం గోడలపై కొందరు వ్యక్తులు విద్వేషపూరిత రాతలు రాసి, ఆలయానికి సంబంధించిన నీటి సరఫరా వ్యవస్థను ధ్వంసం చేశారు.
కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలోని శ్రీ స్వామినారాయణ మందిరం పై ఈ దాడి జరిగింది. గోడలపై అభ్యంతరకర నినాదాలు రాయడంతో పాటు నీటి సరఫరా పైపులను కూడా ధ్వంసం చేశారు. పది రోజుల వ్యవధిలో ఈ తరహా ఘటన చోటుచేసుకోవడం ఇది రెండోసారి. న్యూయార్క్‌లోని మందిరం వద్ద దుండగులు ఇలాగే ప్రవర్తించారు.
ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని శాక్రమెంటో పోలీసులు తెలిపారు. ఆలయంపై దాడి నేపథ్యంలో హిందూ వర్గానికి చెందిన వారంతా ఆలయం వద్దకు చేరుకుని ప్రార్థనలు చేశారు. శాంతి, ఐక్యత కోసం ప్రార్థించారు.
శాక్రమెంటో కౌంటీ హిందూ అమెరికన్ చట్టసభ్యుడు అమిబెరా ఈ దుశ్యర్యను ఖండించారు. మత విద్వేషానికి తావుఇవ్వడం సరికాదన్నారు. మరో కాంగ్రెస్ సభ్యుడు, ఇండియన్ అమెరికన్ రో ఖన్నా కూడా ఈ చర్యను ఖండించారు. చట్టప్రకారం బాధ్యులపై చర్యలను తీసుకోవాలని దర్యాప్తు అధికారులకు సూచించారు.