దేవాలయాల్లో ప్రసాదం, ఇతర అవసరాలకు వినియోగించే నెయ్యిని విజయ డెయిరీ నుంచి కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అధికశాతం దేవాలయాల్లో ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యిని ప్రైవేటు డెయిరీల నుంచి కొనుగోలు చేయడాన్ని ఆక్షేపించింది.
ఇన్నాళ్లూ ప్రభుత్వరంగ సంస్థను కాదని ప్రైవేటు కొనుగోళ్ళకే ఆలయాలు ప్రాధాన్యమివ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. టెండర్లతో సంబంధం లేకుండా ఇకపై ఆలయాల్లో ‘విజయ’ నెయ్యినే వినియోగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
ప్రభుత్వ పాడిపరిశ్రమాభివృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలోని విజయ డెయిరీకి సంబంధించిన నెయ్యిని పట్టించుకోకుండా ఆలయాల ప్రతినిధులు, కమీషన్ల కోసం ప్రైవేటు సంస్థల వైపు మొగ్గుచూపుతుండటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
తెలంగాణలో ఏటా రూ.కోటికి పైగా ఆదాయం ఉన్న దేవాలయాలు 12 ఉండగా, రూ. 50 లక్షల నుంచి రూ.కోటి ఆదాయం వస్తున్న ఆలయాలు 24 ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల ఆదాయం వచ్చే దేవాలయాలు మరో 325 ఉన్నాయి. వీటిన్నింటిలో ప్రైవేటు సంస్థల నుంచే నెయ్యిని కొనుగోలు చేస్తున్నారు.
ప్రభుత్వ ఆధ్వర్యంలోని విజయ డెయిరీకి సంబంధించిన నెయ్యి కొనుగోళ్ళు ఈ ఏడాది నుంచి మందగించాయి. ముంబైకి చెందిన సంస్థలు కొనుగోలు చేయకపోవడంతో 50 టన్నులకు పైగా నెయ్యి డెయిరీ వద్ద నిల్వఉంది. డెయిరీ ఎండీ లక్ష్మీ తమ సంస్థ వద్ద నెయ్యిని కొనుగోలు చేయాలని మార్చి 15న, జూన్ 1న తెలంగాణ దేవాదాయశాఖకు, ప్రముఖ దేవాలయాలకు లేఖలు రాశారు. దీనిపై ఎలాంటి స్పందనా రాలేదని లక్ష్మి తెలిపారు.
తాజా పరిణామాలతో ‘విజయ’ నెయ్యిని కొనేందుకు రాష్ట్రంలోని ఐదు దేవాలయాలు ముందుకొచ్చాయి. వేములవాడ దేవస్థానం పదివేల కిలోలు, బాసర ఆలయం 1,500 కిలోలు, వరంగల్ లోని భద్రకాళి దేవాలయం 1,050 కిలోలు, ధర్మపురి లోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం 980 కిలోలు, మంచిర్యాల లోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం 105 కిలోగ్రాముల నెయ్యి కొనుగోలుకు విజయ డెయిరీని సంప్రదించాయి.