అనంతపురం జిల్లా హనకనహాళ్లో ఈ నెల 23న రామాలయంలోని రథానికి నిప్పు పెట్టిన కేసును 24 గంటల్లో ఛేదించామని ఎస్పి జగదీష్ తెలిపారు. ఈశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి రథానికి నిప్పు పెట్టినట్లు గుర్తించామన్నారు.
‘‘రామాలయంలో రథాన్ని ఎర్రిస్వామిరెడ్డి సోదరులు 2022లో చేయించారు. దానికి రూ.20లక్షలు ఖర్చయినా, గ్రామస్తుల నుంచి విరాళాలేమీ సేకరించలేదు. ఆ విషయంలో అన్నదమ్ముల మధ్య వివాదం నడుస్తోంది. ఆ కారణంగా రథానికి ఎర్రిస్వామిరెడ్డి కుమారుడు ఈశ్వర్‌రెడ్డి నిప్పుపెట్టాడు. అర్ధరాత్రి పెట్రోల్ పోసి నిప్పుపెట్టినట్లు విచారణలో అంగీకరించాడు. అతడు వైసిపి కార్యకర్తే అయినా, ఈ ఘటనలో రాజకీయ కోణం లేదు. నిందితుణ్ణి అరెస్ట్ చేసాం. అతనికి ఇంకెవరైనా సహకరించారా అని దర్యాప్తు చేస్తున్నాం’’ అని ఎస్పి చెప్పారు.
కణేకల్ మండలం హనకనహాళ్‌లోని ఆలయ రథానికి సోమవారం అర్ధరాత్రి నిప్పంటించారు. స్థానికులు అప్రమత్తమై మంటలు ఆర్పివేసేందుకు ప్రయత్నించినా, అప్పటికే రథం పాక్షికంగా దగ్ధమైపోయింది. ముఖ్యమంత్రి ఆ ఘటనను తీవ్రంగా పరిగణించి సమగ్ర దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్, ఎస్పి జగదీష్ ఘటనా స్థలాన్ని మంగళవారం పరిశీలించారు. కులమతాల గొడవలకు సంబంధించిన సంఘటన కాదని వారొక నిర్ధారణకు వచ్చారు.