తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి నాసిరకం నెయ్యి సరఫరా చేసిన తమిళనాడు దిండిగల్‌కు చెందిన ఎఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై చర్యలు తీసుకోవాలని టిటిడి ప్రొక్యూర్‌మెంట్ జనరల్ మేనేజర్ మురళీకృష్ణ తిరుపతి తూర్పు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నాసిరకం నెయ్యి సరఫరా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మురళీకృష్ణ ఫిర్యాదులోని వివరాల మేరకు… టిటిడి ఈ ఏడాది మే 15న నెయ్యి సరఫరా కోసం ఎఆర్ ఫుడ్ సంస్థకు ఆర్డర్ ఇచ్చింది. వారు జూన్ 12, 20, 25 తేదీల్లోనూ, జులై 6, 12 తేదీల్లోనూ 4 ట్యాంకర్ల నెయ్యి సరఫరా చేసారు. లడ్డూ నాణ్యతపై వరుస ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్‌డిబిఎల్ సహకారంతో టిటిడి అడల్ట్రేషన్ టెస్టింగ్ నిర్వహించింది. ఎఆర్ డెయిరీ సరఫరా చేసిన నేతిలో జంతుకొవ్వులు కలిసినట్లు గుజరాత్ ఆనంద్‌లోని ఎన్‌డిడిబి కాఫ్ ల్యాబ్ నిర్ధారించింది. ఎన్‌డిడిబికి పంపిన అన్ని నమూనాల్లోనూ అపవిత్ర పదార్థాలు కలిసాయని, కల్తీ భారీగా జరిగిందని తేలింది.
ఏఆర్ ఫుడ్ సంస్థ నాణ్యతా నిబంధనలను అనుసరిస్తుందని భావించినా, దానికి భిన్నంగా వ్యవహరించినట్లు నమూనా పరీక్షల్లో తేలింది. దాంతో ఆ సంస్థకు జులై 22, 23, 27 తేదీల్లో నోటీసులు జారీ చేశారు. 28న రిజాయిండర్ నోటీసు పంపారు. ఆ సంస్థ జులై 28, సెప్టెంబరు 4న వివరణ ఇస్తూ తాము ఎలాంటి కల్తీ నెయ్యి సరఫరా చేయలేదని తెలిపింది.
ఈ వ్యవహారంలో సమగ్ర దర్యాప్తు చేసి దోషులను బైటపెట్టాలని మురళీకృష్ణ కోరారు. ఆ ఫిర్యాదు మేరకు ఏఆర్ డెయిరీ ఫుడ్ సంస్థపై పోలీసులు ఆహార భద్రతా చట్టం, భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.