విజయవాడ వాసులు ఇటీవల ఎదుర్కొన్న విపత్తును తన జీవితంలో ఇంతవరకూ చూడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఓ వైపు ఒకేచోట కుండపోతగా కురుస్తున్న వర్షం, మరో వైపు బుడమేరుకు కనీవినీ ఎరుగని వరద వచ్చిందని గుర్తు చేశారు. విజయవాడలో వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేసే కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, రోజుల తరబడి వరదల్లోనే అధికారులు, మంత్రులతో పాటు తాను కూడా తిరిగానని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లోనే ఉండి ఎప్పటికప్పుడు వరద సాయంపై పర్యవేక్షణ చేశానన్నారు. డ్రోన్లను, ఫైరింజన్లను, ప్రొక్లెయిన్లను ఉపయోగించి బాధితులను ఆదుకున్నామని చెప్పారు.
‘మూడు రోజులుగా తాగునీరులేదు… పిల్లల కోసం పంపించగలరా’ అంటూ వరద బాధితులు అడిగితే ఓ సీఎంగా చాలా బాధపడ్డా అని తెలిపారు. వెంటనే అధికారులను పంపించి లక్షలాది వాటర్ బాటిళ్లను సేకరించి పంచామన్నారు. కోటికి పైగా వాటర్ బాటిళ్లను వరదబాధితులకు పంచామని చెప్పారు.
సీఎం రిలీఫ్ ఫండ్ కు రికార్డు స్థాయిలో విరాళాలు వచ్చాయన్న చంద్రబాబు, దాతలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. సంఘటితంగా ముందుకు వస్తే విపత్తులను ఎదుర్కోవచ్చని చాటిచెప్పారని దాతలను కొనియాడారు.
14 కోట్ల వాటర్ బాటిళ్లు, 37 లక్షల పాల బాటిళ్లు, 47 లక్షల బిస్కెట్ ప్యాకెట్లు,5 లక్షల కోడి గుడ్లు, 3.50 లక్షల కోవ్వత్తులు, 2.30 లక్షల మ్యాచ్ బాక్సులు, 1.15 కోట్ల ఆహార పొట్లాలు, 5 వేల క్వింటాళ్ల కూరగాయలు పంపిణీ చేశామని చెప్పారు.
దాదాపుగా 75 వేల నివాసాలు, 330 కిలోమీటర్ల మేర రోడ్లను ఫైర్ డిపార్ట్ మెంట్ సిబ్బంది శుభ్రం చేశారని వివరించారు.20 వేల మెట్రిక్ టన్నుల చెత్తను శానిటేషన్ డిపార్ట్ మెంట్ సిబ్బంది తొలగించారని తెలిపారు.