నలుగురు వ్యక్తులు 12ఏళ్ళ బాలుడి యజ్ఞోపవీతాన్ని తెంచివేసిన సంఘటన తమిళనాడులో గత శనివారం చోటు చేసుకుంది. ఆ సంఘటనను పోలీసుల దృష్టికి తీసుకువెడితే ఆ అబ్బాయి అబద్ధాలాడుతున్నాడని మండిపడ్డారు. తమిళనాట హిందువుల దుస్థితికి ఈ సంఘటన నిదర్శనంగా నిలిచింది.
సెప్టెంబర్ 21 శనివారం సాయంత్రం సుమారు 4.30 సమయంలో తమిళనాడులోని త్యాగరాజనగర్‌లో అఖిలేష్ అనే 12ఏళ్ళ బాలుడు ఒక ధార్మిక కార్యక్రమానికి వెడుతున్నాడు. అతన్ని నలుగురు వ్యక్తులు అడ్డగించి అతనిపై దాడి చేసి, ఆ బాలుడి జందేన్ని తెంచివేసారు. ఆ పిల్లవాణ్ణి బెదిరించి వారు ఆ ప్రదేశం నుంచి పారిపోయారు. అఖిలేష్ ఆ విషయాన్ని తన తల్లిదండ్రులకు ఆ కార్యక్రమ నిర్వాహకులకు తెలియజేసాడు. వారు పెరుమాళ్‌పురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు.
తమిళనాడు పోలీసులు ఆ వ్యవహారంలో దర్యాప్తు ప్రారంభించారు. సంఘటన జరిగిన శివాండిపట్టి రోడ్ ప్రాంతంలోని సిసిటివి ఫుటేజ్‌ను సేకరించి నిందితులను గుర్తించే ప్రయత్నం చేసారు. తర్వాత ఏం జరిగిందో ఏమో, ఆ బాలుడు కట్టుకథలు చెప్పాడంటూ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేసారు. దాంతో ఆ సంఘటన వివాదం మరింత పెద్దదైపోయింది. రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశమైంది.
జరిగిన దాడిని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తక్కువ చేసి చూపుతోందంటూ పలువురు రాజకీయ నాయకులు, ధార్మిక గురువులు స్పందించారు, పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండించారు. కేంద్ర సహాయమంత్రి ఎల్ మురుగన్ ఆ బాలుడి ఇంటికి వెళ్ళి పరామర్శించారు. సంఘటనలో దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి నానాటికీ దిగజారిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేసారు.
హిందూ మున్నాని సంస్థ నాయకుడు, న్యాయవాది కుట్రలింగం ఆ సంఘటనను తీవ్రంగా ఖండించారు. సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యా తీసుకోకుండా మౌనంగా ఎందుకు ఉండిపోయిందని ప్రశ్నించారు. అది కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనే అని మండిపడ్డారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ విమర్శకులను అరెస్ట్ చేయడంలో వేగంగా స్పందించే పోలీసులు ఈ సంఘటనలో దోషులను ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీసారు.
జరిగిన సంఘటన మతస్వేచ్ఛపై దాడి అంటూ, తమిళనాడు బ్రాహ్మణ సంఘం ఆ చర్యను తీవ్రంగా ఖండించింది. రాష్ట్రప్రభుత్వం వేగంగా స్పందించి, కఠినంగా చర్య తీసుకోవాలని కోరింది. బ్రాహ్మణ వ్యతిరేక వాదనలు, వారిని లక్ష్యం చేసుకుని దాడులూ పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేసింది. కొన్నాళ్ళుగా రాజకీయ నాయకుల ప్రకటనలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సందర్భాలను గుర్తుచేసింది. ఇటువంటి దుశ్చర్యలు దేశపు లౌకికవాద స్వభావానికి ముప్పు కలగజేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.
తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి ఈ సంఘటనను ఖండించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ వెంటనే జోక్యం చేసుకుని ఆ బాలుడికి న్యాయం చేయాలని కోరారు. జందెం బ్రాహ్మణులే కాక చెట్టియార్లు, వైశ్యులు, స్వర్ణకారులు, తదితర కులాల వారు కూడా ధరిస్తారని చెప్పారు. ఆ సంఘటన కేవలం ఆ బాలుడిపైనే కాక హిందూమతాన్ని అనుసరించే వారిపై దాడి అని అభిప్రాయపడ్డారు. జస్టిస్ పార్టీ, ద్రవిడర్ కళగం నుంచి ఇప్పటి అధికార ద్రవిడ మున్నేట్ర కళగం వరకూ వివిధ రాజకీయ పక్షాలు ప్రచారం చేసిన సైద్ధాంతిక ఘర్షణల పరంపరలో భాగంగానే ఈ దాడి జరిగిందని ఆరోపించారు.
డిఎంకె అధికారంలోకి వచ్చిన ప్రతీసారీ ఇటువంటి హిందూ, బ్రాహ్మణ వ్యతిరేక సంఘటనలు తరచుగా జరుగుతుండడంలో ఒక క్రమం ఉందని విమర్శకులు విశ్లేషిస్తున్నారు. 1980లలో, ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్రాహ్మణులే లక్ష్యంగా చేసిన దాడులను గుర్తుచేస్తున్నారు.
బ్రాహ్మణ బాలుడిపై దాడి ఘటనను పోలీసులు మార్చివేయడం హిందూసంఘాలకు ఆగ్రహం కలిగించింది. ఆ పిల్లవాడిపై ఎలాంటి దాడీ జరగలేదని, బాలుడే కట్టుకథలు కల్పించాడంటూ తిరునల్వేలి పోలీసులు చెప్పడంపై హిందూ సంఘాలు మండిపడ్డాయి. తమ కొడుకు ఆ దాడితో తీవ్ర భయాందోళనలకు లోనయ్యాడని, అందువల్ల సంఘటన గురించి సరిగ్గా చెప్పలేకపోయి ఉంటాడనీ, దాంతో పోలీసులు అసలు దాడే జరగలేదని బుకాయిస్తున్నారనీ అఖిలేష్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేసారు.
పోలీసుల వ్యవహారశైలి మొదట్నుంచీ ఇలాగే ఉందని విమర్శకులు గత ఉదాహరణలతో సహా చెబుతున్నారు. కోయంబత్తూరులో బాంబుపేలుడు జరిగినప్పుడు దాన్ని మొదట గ్యాస్ సిలెండర్ పేలుడుగా చూపారని, దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం ఘటనలను మతిలేని వ్యక్తులు చేసిన చర్యలుగా మార్చి చూపారనీ గుర్తు చేసారు. హిందువులపై దాడుల విషయంలో ప్రభుత్వం ఉదాసీనత చూపుతోందని ఆవేదన వ్యక్తం చేసారు.