కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేదవ్యాసాచార శ్రీశానంద ఇటీవల తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణ చెప్పడంతో ఆ కేసు విచారణను సుప్రీంకోర్టు మూసివేసింది. న్యాయవ్యవస్థ హుందాతనాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయం తీసుకున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ప్రకటించింది.
ఇటీవల ఒక కేసు విచారణలో భాగంగా కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ వేదవ్యాసాచార శ్రీశానంద వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. బెంగళూరులో ఒక ఇంటి యజమాని-అద్దెకుండే వ్యక్తి మధ్య వివాదం విచారణ సందర్భంగా ఆయన, నగరంలోని ముస్లిం మెజారిటీ ప్రాంతాన్ని ‘పాకిస్తాన్’ అని పిలిచారు. ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. వాటిగురించి వివరణ కోరుతూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు, కర్ణాటక హైకోర్టు ఆ వ్యవహారంపై సర్వోచ్చ న్యాయస్థానానికి నివేదిక సమర్పించింది.
‘‘భారతదేశంలోని ఏ ప్రాంతాన్నీ పాకిస్తాన్ అని ఎవ్వరూ అనలేరు. అది మౌలికంగా దేశ ప్రాదేశిక సమగ్రతకు విరుద్ధం. సూర్యకాంతికి జవాబు మరింత సూర్యకాంతి కావాలి తప్ప చీకటి కాదు. కోర్టులో జరిగిన సంగతిని అణచివేయకూడదు’’ అని చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.
కర్ణాటక హైకోర్టు జడ్జి వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారాన్ని సుప్రీంకోర్టు తనంత తానుగా స్వీకరించి, నివేదిక కోరింది. కోర్టుల్లో న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సీజేఐ చంద్రచూడ్, న్యాయమూర్తులు ఎస్ ఖన్నా, బిఆర్ గవాయ్, ఎస్ కాంత్, హెచ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.
‘‘యథాలాపంగా చేసే వ్యాఖ్యల్లో, ప్రత్యేకించి ఒక జెండర్ లేదా ఒక సామాజికవర్గానికి సంబంధించి చేసే వ్యాఖ్యల్లో, ఒక్కోసారి వ్యక్తిగత ఇష్టాయిష్టాలు దూరిపోతాయి. అందుకే న్యాయమూర్తులు పితృస్వామ్య లేదా మహిళా వ్యతిరేక వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. ఒక నిర్దిష్టమైన జెండర్ లేదా సామాజికవర్గానికి సంబంధించి పరిశీలనల గురించి ఆందోళన చెందుతున్నాం. అలాంటి పరిశీలనలను ప్రతికూలంగా చూడాలి. న్యాయమూర్తులు తమకు అప్పగించిన విధులను ఎలాంటి వివక్షా లేకుండా జాగ్రత్తగా నిర్వహిస్తారని నమ్ముతున్నాం, ఆశిస్తున్నాం’’ అని చంద్రచూడ్ వ్యాఖ్యలు చేసారు.
న్యాయస్థానాల్లో జరిగే వ్యవహారాలను పరిశీలిస్తూ, వాటిని పట్టిపట్టి విశ్లేషించడంలో సామాజిక మాధ్యమాలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి కాబట్టి న్యాయమూర్తులు మరింత జాగ్రత్తగా మాట్లాడాలి. కేసుల విచారణ సమయంలో వ్యాఖ్యలు చేసేటప్పుడు న్యాయమూర్తుల నుంచి ఆశించే హుందాతనం తగ్గకుండా చూసుకోవాలని సుప్రీం బెంచ్ అభిప్రాయపడింది.