అనంతపురం జిల్లాలో రథం దగ్ధం సంఘటన హిందువుల్లో ఆందోళన కలిగించింది. కనేకల్ మండలం హనకనహాల్ గ్రామంలోని ఒక ఆలయంలో గత అర్ధరాత్రి తర్వాత రథాన్ని తగులబెట్టిన సంఘటన చెటు చేసుకుంది. గుర్తు తెలియని ఆగంతకులు ఉద్దేశపూర్వకంగానే రథాన్ని తగులబెట్టి ఉంటారని భావిస్తున్నారు. ఆ దుశ్చర్య పట్ల భక్తుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. హిందువుల మతవిశ్వాసాల మీద ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడుల పరంపరలో ఇది కూడా ఒకటని మండిపడుతున్నారు.
ఆ సంఘటనను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. హిందూ ఆలయాలు, సంబంధిత చిహ్నాలను లక్ష్యం చేసుకుని దాడులు చేయడంపై ఆవేదన వ్యక్తం చేసారు. జిల్లా అధికారులతో మాట్లాడి ఆ సంఘటన గురించిన వివరాలు తెలుసుకున్నారు. ఆ విసయంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆదేశించారు. రథం దగ్ధానికి కారణమైన నేరస్తులను పట్టుకుని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. రథం దగ్ధం వంటి చర్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను ప్రత్యక్షంగా గాయపరుస్తాయన్న ముఖ్యమంత్రి, ఆ ఘటనకు బాధ్యులను త్వరగా పట్టుకుని శిక్షించాలన్నారు.
తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో, అనంతపురం జిల్లాలోని దేవాలయంలో రథం దగ్ధం ఘటన రాష్ట్రంలో హిందువుల విశ్వాసాలపై పెరుగుతున్న దాడులకు సూచికగా నిలిచింది. ఆ ఘటనపై దర్యాప్తు జరిపి దోషులను త్వరగా పట్టుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మరోవైపు, రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్తతలను నివారించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ ప్రతిపక్షం విమర్శిస్తోంది.
2020 సెప్టెంబర్‌లో తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలోని 60 యేళ్ళనాటి చెక్క రథం అనుమానాస్పద పరిస్థితుల్లో దగ్ధమైపోయింది. అంతర్వేది గుడి ఆవరణలోనే ఉన్న రథం తెల్లవారుజాము సమయంలో మంటల్లో చిక్కి కాలి బూడిదైపోయింది. ఆ సంఘటన హిందువులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది.