తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ ఈ ఉదయం ఇంద్రకీలాద్రి మీద దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్‌సిపి నాయకుల వైఖరిని తప్పుపట్టారు. అదే సమయంలో, ‘సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు’ గురించి తన ప్రతిపాదన మీద ట్వీట్ చేసిన సినీనటుడు ప్రకాష్‌రాజ్‌కు కౌంటర్ ఇచ్చారు. లౌకికవాదం ఏకపక్షంగా ఉండకూడదని, ఇరువైపులా సమానంగా ఉండాలనీ గుర్తుచేసారు.
పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ, ‘‘దుర్గ గుడిలో వెండి సింహాలు మాయమైనప్పుడు వైసీపీ నాయకులు అవహేళన చేస్తూ మాట్లాడారు. హిందూ ధర్మాన్ని పాటించే వారే ‘ఆ సింహాలతో మేడలు, మిద్దెలు కట్టుకుంటామా’ అనడం బాధ కలిగించింది. వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి మతం మారారో లేదో మాకు తెలియదు. హైందవ ధర్మాన్ని కాపాడుతామని బాధ్యతాయుతమైన పదవిలో ఉండి దానిని మరిచారు కాబట్టే వారిని ప్రశ్నిస్తున్నాం. జగన్ నియమించిన టిటిడి బోర్డులో తప్పు జరిగింది. ల్యాబ్ రిపోర్టులతో సహా విషయం బైటపడినా దబాయిస్తున్నారు. తప్పు జరిగినప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకుంటామనాలి. లేదా అప్పటి బోర్డులో ఉన్న అధికారులు, బోర్డు సభ్యుల ప్రమేయం మీద మాట్లాడాలి. అంతేగాని ఇష్టానుసారం మాట్లాడడం మంచిది కాదు. ఇలాంటి సమయంలో ప్రాయశ్చిత్తం లేదా మౌనం మేలు’’ అన్నారు.
‘‘వైవీ సుబ్బారెడ్డిని విచారణకు రమ్మంటే ఫైల్స్, రికార్డ్స్ అన్ని అడుగుతున్నారు. మీ హయాంలో తప్పు జరిగితే దానికి సంబంధించిన ఫైల్స్ మీకు ఇవ్వాలా? మీ హయాంలో అలాగే ఇచ్చారా? కరుణాకర్ రెడ్డి తిరుమలలో పెద్ద యాక్టింగ్ చేశారు. తిరుమలలో ఏదైనా అపచారం జరిగితే తమ కుటుంబాలు నాశనం అవుతాయని ఆయనే శపథం చేశారు. మీ నాశనం మొదలైంది.. మిగతాది పైన ఉన్న భగవంతుడే చూసుకుంటాడు. ఇంత పెద్ద అపచారం జరిగితే అప్పటి ఈవో ధర్మారెడ్డి గాయబ్ అయ్యారు. ఆయన ఎక్కడున్నారో కూడా తెలీదు. ఆయన హయాంలో తిరుమలను వ్యాపార, పర్యాటక కేంద్రంగా మార్చారు. ధర్మారెడ్డి కొడుకు చనిపోతే కనీసం 11 రోజులు ఆలయంలోకి వెళ్లకుండా ఉండలేకపోయారు. ఆగమశాస్త్రం పాటించే తిరుమలలో ఇష్టానుసారం ప్రవర్తించారు’’ అంటూ వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డిలపై ఆగ్రహం వ్యక్తం చేసారు.
హైకోర్టు మాజీ ఏజీపీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యాఖ్యల మీదా పవన్ ఘాటుగా స్పందించారు. ‘‘లడ్డు అపవిత్రం అయిందని మేము మాట్లాడితే పొన్నవోలు సుధాకర్ రెడ్డి మదం ఎక్కినట్లు మాట్లాడుతున్నారు. పంది కొవ్వు చాలా ఎక్కువ ధర ఉంటుందని దాన్ని సాధారణ నెయ్యిలో ఎలా కలుపుతారు అంటూ అవహేళనగా మాట్లాడుతున్నారు. ఆయనా హిందువే. హిందూధర్మం పాటించే ప్రజలు ఎంతో పవిత్రంగా భావించే లడ్డుకి అపచారం జరిగితే సాటి హిందువుగా ఇలాంటి మాటలు మాట్లాడడం దారుణం. భక్తుల మనోభావాలను మరింత దెబ్బ కొట్టేలా ఈ మాటలు ఉన్నాయి’’ అని మండిపడ్డారు.
లౌకికవాదం గురించి పవన్‌కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడూ చెప్పని విధంగా, లౌకికవాదం ఒక్క పక్షానికి మాత్రమే చెందినది కాదని స్పష్టం చేసారు. ‘‘ఈ దేశంలో సెక్యులరిజం టూ వే గా ఉండాలి. సెక్యులరిజం కేవలం వన్ వే మాత్రం కాదు. ఇతర మతాల ఆచారాలకు, సంప్రదాయాలకు విఘాతం కలిగితే ఎలా స్పందిస్తున్నారో… హిందువుల మనోభావాలకు, ఆచారాలకు, సంప్రదాయాలకు, ధర్మాలకు విఘాతం కలిగినప్పుడు కూడా స్పందించాలి’’ అని పవన్ స్పష్టం చేసారు.
హిందువుల్లో ఐకమత్యం లేకపోవడంపై పవన్ ఆవేదన వ్యక్తం చేసారు. ‘‘సాటి హిందువులను తోటి హిందువులు తూలనాడడం మానుకోవాలి. హిందువులంతా- సనాతన ధర్మానికి ఏ మాత్రం విఘాతం కలిగినా కలిసికట్టుగా ముందుకు రావాలి. భవిష్యత్తు తరాలకు సనాతన ధర్మాన్ని అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. హిందువులకు చేతులెత్తి మొక్కుతున్నాను. బైటకు రండి. సనాతన ధర్మ రక్షణ కోసం తుది వరకూ పోరాడతాను. అవసరమైతే ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం. మనం పాటించే మత ధర్మానికి విఘాతం కలిగినప్పుడు కచ్చితంగా ప్రశ్నించాల్సిన బాధ్యత మనపై ఉంది. సనాతన ధర్మాన్ని ఎంతో హుందాగా వచ్చే తరానికి అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. మన మౌనం ధర్మ వినాశనానికి దారి కాకూడదు’’ అంటూ పిలుపునిచ్చారు.
లడ్డూ వివాదం మొదలైనప్పుడు, దేశవ్యాప్తంగా దేవాలయాల నిర్వహణకు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలంటూ పవన్ కళ్యాణ్ చేసిన ప్రతిపాదన మీద ప్రముఖ నటనాస్తికుడు, బీజేపీ వ్యతిరేకి ముసుగులో హిందుత్వాన్ని వ్యతిరేకించే ప్రకాష్‌రాజ్ పోస్ట్ పెట్టారు. ‘‘మీరు ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన సంఘటన అది. దాన్ని విచారించి నేరస్తులపై చర్యలు తీసుకోండి. మీరెందుకు అనవసర భయాలు కల్పించి ఆ వ్యవహారాన్ని జాతీయస్థాయిలో చర్చనీయాంశం చేస్తారు? మనదేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తతలు చాలు. (కేంద్రంలోని మీ స్నేహితులకు ధన్యవాదాలు)’’ అంటూ పోస్ట్ పెట్టారు. దేశంలో బీజేపీయే మత ఉద్రిక్తతలు రాజేస్తోందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
దానికి జవాబుగా పవన్‌కళ్యాణ్, ‘‘సినీనటుడు ప్రకాష్ రాజ్ నాకు మంచి మిత్రుడు. ఆయనపై ఎనలేని గౌరవం ఉంది. అయితే సనాతన ధర్మానికి, పవిత్రతకు భంగం కలిగినప్పుడు ఆ ధర్మాన్ని ఆచరించే వాళ్లు మాట్లాడడం కూడా తప్పే అన్నట్లు చెబితే ఎలా? ఇదే తప్పు ఓ మసీదు లేదా చర్చికి జరిగితే ఇలాగే మాట్లాడతారా? దేశంలో హిందువులకు ఏం జరిగినా సరే మాట్లాడే హక్కు లేదా? మా హిందూ దేవతలను ఇష్టానుసారం వ్యంగ్యంగా మాట్లాడుతూ, వారిపై రకరకాల జోకులు వేస్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలా? మా మనోభావాలు దెబ్బ తిన్నా నోరు మూసుకొని ఉండాలా? ఇదేనా మీరు చెబుతున్న సెక్యులరిజం?’’ అంటూ ప్రకాష్‌రాజ్‌ను నిలదీసారు.
సినీ పరిశ్రమలో హిందువులను చిన్నచూపు చూసే ధోరణి మీదా పవన్‌కళ్యాణ్ స్పందించారు. ‘‘సినిమా ఇండస్ట్రీ వారిని కూడా నేను వేడుకుంటున్నాను. సనాతన ధర్మానికి సంబంధించిన విషయాల్లో ఇష్టానుసారం జోకులు వేయడం, దాన్ని మీమ్స్ చేయడం సరికాదు. నిన్న ఓ సినిమా ఫంక్షన్ లో కూడా ఇలాగే జోకులు వేస్తున్నారు. సీరియస్ అంశాలను, ఎంతోమంది మనోభావాలతో ముడిపడి ఉన్న అంశాలను మాట్లాడే సమయంలో జాగ్రత్తగా మాట్లాడండి’’ అని సూచించారు.
తమిళ హీరో కార్తి సినిమా తెలుగులో విడుదల సందర్భంగా నిన్న హైదరాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో పాత్రికేయులు ప్రశ్నించినప్పుడు కార్తి ‘ఇప్పుడు లడ్డూ సున్నితమైన అంశం, దానిగురించి మాట్లాడను’ అని జవాబిచ్చారు. దాన్ని పవన్ తప్పుపట్టడంతో కార్తి స్పందించారు. తనకు ఏ ఉద్దేశమూ లేదనీ, అయినా తన వ్యాఖ్యల వల్ల తలెత్తిన అపార్ధానికి క్షమాపణ చెబుతున్నాననీ ట్వీట్ చేసారు. తాను కూడా వేంకటేశ్వర స్వామి భక్తుడినేననీ, మన సంప్రదాయాలను గౌరవిస్తాననీ వివరించారు.